చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగు ప్రొఫెసర్ కీలకపాత్ర!
- June 08, 2025
కశ్మీర్: కశ్మీర్ లోయ అనుసంధానతకు ఈ వంతెన ఓ మైలురాయి రూ.1,486 కోట్ల వ్యయంతో నిర్మాణం, ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైనది జమ్మూకశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, చీనాబ్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టు విజయవంతం కావడంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్, తెలుగింటి ఆడపడుచు జి.మాధవీలత కీలక పాత్ర పోషించారు.సుమారు 17 సంవత్సరాల పాటు జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా ఆమె ఈ ప్రాజెక్టుతో మమేకమై పనిచేశారు.
ప్రొఫెసర్ మాధవీలత నేపథ్యం
ప్రస్తుతం ఐఐఎస్‌సిలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాధవీలత ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు.1992లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్‌తో బీటెక్ పూర్తి చేశారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ అభ్యసిస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. 2000 సంవత్సరంలో ఐఐటీ-మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లోనే డాక్టరేట్ పొందారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి 'బెస్ట్ ఉమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్' అవార్డు అందుకున్నారు. 2022లో 'టాప్ 75 ఉమెన్ ఇన్ స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్) ఆఫ్ ఇండియా' జాబితాలో కూడా స్థానం సంపాదించారు.
చీనాబ్ ప్రాజెక్టులో కీలక భూమిక
చీనాబ్ వంతెన నిర్మాణం చేపట్టిన ప్రాంతంలోని క్లిష్టమైన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మారుమూల ప్రదేశం కావడం వంటి అంశాలు నిర్మాణాన్ని అత్యంత సవాలుగా మార్చాయి. ప్రొఫెసర్ మాధవీలత, వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్‌కాన్స్ సంస్థతో కలిసి ప్రణాళిక, డిజైన్ మరియు నిర్మాణ దశల్లో భూసంబంధమైన ఆటంకాలను అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించారు.
ఆమె బృందం 'డిజైన్ యాజ్ యూ గో' అనే వినూత్న విధానాన్ని అనుసరించింది. ప్రాథమిక సర్వేలలో కనిపించని విరిగిన రాళ్లు, రహస్య ఖాళీ ప్రదేశాలు, వివిధ రకాల రాతి లక్షణాలు వంటి వాస్తవ భూగర్భ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్‌లో మార్పులు చేస్తూ ముందుకు సాగారు.నిర్మాణ సమయంలో ఎదురైన యథార్థ రాతి పరిస్థితులకు అనుగుణంగా సంక్లిష్టమైన గణనలు, డిజైన్ సవరణలు చేశారు.బ్రిడ్జి స్థిరత్వాన్ని పెంచడానికి రాక్ యాంకర్ల రూపకల్పన, వాటిని అమర్చాల్సిన ప్రదేశాలపై ఆమె అందించిన సలహాలు అమూల్యమైనవి.
ఇటీవలే ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్ మహిళా ప్రత్యేక సంచికలో 'డిజైన్ యాజ్ యూ గో: ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్' అనే పేరుతో ఆమె ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. స్థలంలోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, వంతెన మొత్తం నిర్మాణం, ప్రదేశం, రకం స్థిరంగా ఉండగా, డిజైన్ ఎలా నిరంతరం రూపాంతరం చెందిందో ఈ పత్రం వివరిస్తుంది.
చీనాబ్ బ్రిడ్జి...కొన్ని విశేషాలు
సుమారు రూ.1,486 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ బ్రిడ్జిను 'భారతదేశ రైల్వే ప్రాజెక్టుల చరిత్రలో ఎదురైన అతిపెద్ద సివిల్-ఇంజనీరింగ్ సవాలు'గా ప్రభుత్వం అభివర్ణించింది. 359 మీటర్ల ఎత్తుతో, ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఈ వంతెన నిర్మితమైంది. ఈ ప్రాజెక్టు 2003లో ఆమోదం పొందిన 272 కిలోమీటర్ల ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగం.ఈ బ్రిడ్జి కశ్మీర్ లోయలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..