ఒరిస్సా ఉక్కు మహిళా-నందిని సత్పతి
- June 09, 2025
నందిని సత్పతి...భారత దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మహిళా నేతలకు ఆదర్శనీయురాలైన నాయకురాలు. ఒరిస్సాకు చెందిన ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమె జనం మెచ్చిన మాస్ లీడర్‌గా ఎదిగారు. ఒరిస్సా రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజ నాయకులను అలవోకగా మట్టి కరిపించి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా ఆమె తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా గిరిజన సమాజానికి లబ్ది చేకూరింది. నేడు ఒరిస్సా ఉక్కు మహిళా నందిని సత్పతి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
నందిని సత్పతి పూర్తి పేరు నందిని దేవి సత్పతి. 1931,జూన్ 9న అవిభక్త బీహార్ & ఒరిస్సా ప్రావిన్స్ రాష్ట్రంలోని అవిభక్త పూరీ జిల్లా బిశ్వానాథ్‌పూర్ గ్రామంలో కాళింది చరణ్ పాణిగ్రహి, రత్నమాల దంపతులకు జన్మించారు. ఒరియా విద్యా, రాజకీయ రంగాల్లో ఉన్నతమైన స్థానంలో కుటుంబాల్లో నందిని కుటుంబం ఒకటి. తండ్రి ఒరియా జాతీయ కవిగా ప్రసిద్ధి చెందగా, బాబాయి భగవతి చంద్ర పాణిగ్రహి ఒరిస్సా కమ్యూనిస్టు పార్టీ స్థాపకుల్లో ఒకరు. నందిని బాల్యం, విద్యాభ్యాసం మొత్తం కటక్ నగరంలోనే సాగింది. కటక్‌లోని ప్రముఖ రేవెన్ షా కాలేజీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
నందిని బాల్యంలోనే తన బాబాయి అడుగుజాడల్లో నడుస్తూ కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. స్వాతంత్య్ర పోరాటంలో సైతం పాల్గొన్నారు. కాలేజీ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ విద్యార్ధి విభాగం ఎస్.ఎఫ్.ఐలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సమయంలోనే కాలేజీ ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత తన తోటి విద్యార్థులతో పాటుగా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఎస్.ఎఫ్.ఐ నుంచి కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్లాల్సిన సమయంలోనే అప్పటి దేశ ప్రధాని నెహ్రూ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, సీఎంలు తమ కుటుంబానికి పరిచయస్తులు కావడంతో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో నందిని బాగా ఇమిడిపోయారు.
ఒరిస్సా మహిళా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న సమయంలోనే 1959లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిరా గాంధీతో ఏర్పడ్డ పరిచయం నందిని రాజకీయ ఎదుగుదలకు దోహదపడింది.1960లో చెన్నై నగరంలో నిర్వహించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ సమావేశాల్లో నందినిలోని అద్భుతమైన కార్యనిర్వాహక దక్షత, శక్తివంతమైన వాక్పటిమ ఇందిరాను ఆకట్టుకున్నాయి. ఆ సమావేశాల తర్వాత నందినిని అఖిల భారత మహిళా కాంగ్రెస్ బాధ్యురాలిగా నియమించారు. 1962లో ఇందిరా ప్రోద్బలంతో ఒరిస్సా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టిన నాటి నుండి ఆమెకు పలు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న, చేయబోయే పథకాల మీద వేసిన కమిటీ నిర్వహణ నందిని చూసేవారు.
1966లో ఇందిరా ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఆమెకు పార్టీ వ్యవహారాల నిర్వహణలో కుడిభుజంగా మారారు. ఈ దశలోనే ఆమె చంద్రశేఖర్ నేతృత్వంలోని 'యంగ్ టర్క్స్" బృందంతో సన్నిహితంగా పనిచేశారు. ఇందిరాను వామపక్ష సోషలిస్టు భావజాలం వైపు నడిపించడంలో నందిని కీలక పాత్రధారి. 1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిన సమయంలో ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ నేతలు పాత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపగా, నందిని మాత్రం ఇందిరా వైపు గట్టిగా నిలబడ్డారు. బ్యాంకుల జాతీయకరణ, రాజ్య భరణాల రద్దు, పేదలకు సంక్షేమ పథకాల అమలు చేసేలా ఇందిరాను ప్రోత్సహించారు. 1969-72 వరకు సమాచార & ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
1972లో ఒరిస్సా కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా నందినిని ఒరిస్సా సీఎంగా పంపించారు. అలా ఒరిస్సా రాష్ట్ర చరిత్రలో తోలి మహిళా సీఎంగా, దేశవ్యాప్తంగా రెండో మహిళా సీఎంగా నిలిచిపోయారు. 1972-973 మధ్యలో 223 రోజుల పాటు సీఎంగా ఉన్న తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్రపతి పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి 1974 ఎన్నికల్లో బిజూ పట్నాయక్, హరే కృష్ణ మహతాబ్, రాజేంద్ర సింగ్ నారాయణ్ దేవ్ వంటి రాజకీయ ఉద్దండులు నేతృత్వం వహిస్తున్న పార్టీలను మట్టికరిపించి కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు.
1974లో ఒరిస్సా సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నందిని 1976 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. రెండోసారి సీఎంగా వచ్చిన నాటి నుంచి 20 అభివృద్ధి సూత్రాలను నిర్బందంగా అమలు చేశారు. అలాగే, ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన, పవర్ ప్లాంట్స్ ఏర్పాటుకు అనుమతులు, గిరిజనలు పాలిట యమపాశంగా మారిన ఒరిస్సా వడ్డీ వ్యాపారుల ఆటకట్టించేందుకు కఠినమైన చట్టం తేవడం, పొగాకు సిండికేట్ అక్రమాలను కఠినంగా అణిచివేయడం వంటివి ఆమె హయాంలో జరిగింది. అయితే, ఎమెర్జెన్సీ సమయంలో ఇందిరా ఆదేశాలను పాటించి విపక్షనేతలను అక్రమంగా అరెస్ట్ చేయించడం, నిర్బందంగా కుటుంబ నియంత్రణ, పోలీసుల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోకపోవడం కూడా తర్వాత కాలంలో నందిని రాజకీయ జీవితానికి ప్రతిబంధకాలుగా మారాయి.
1977లో ఎమెర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలకు వెళ్లగా, పార్టీలో సీనియర్ నేతలైన జగ్జీవన్ రామ్, బహుగుణ మరియు నందిని రాజీనామా చేసి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి జనతా పార్టీతో కలిసి పోటీ చేయడం జరిగింది. తన ఆత్మీయురాలైన నందిని వెన్నుపోటును ఇందిరా చివరి వరకు సహించలేకపోయింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్జీవన్ రామ్, బహుగుణలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి గాని నందినికి ఎటువంటి పదవులు దక్కలేదు. ఇది ఒకవిధంగా ఆమెను ఆగ్రహానికి గురి చేసింది.
అదే సమయంలో జరిగిన ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో జనతాపార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగా సీఎం పదవిని నందినికి ఇవ్వడానికి జనతా పార్టీ సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడం మూలంగా సీఎం పదవి దక్కలేదు. ఈ విషయంలో బహుగుణ, జగ్జీవన్ రామ్ తనకు అన్యాయం చేశారని భావించిన నందిని కాంగ్రెస్ (ఆర్స్)కు దగ్గరయ్యారు. శరద్ పవార్, దేవరాజ్ ఆర్స్, ఏకే ఆంటోని, యాశ్వంత్ రావ్ చవాన్ వంటి ఉద్దండులతో బలంగా ఉన్న ఆ పార్టీని ఒరిస్సాలో బలోపేతం చేసే బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.
ఇందిరా తిరిగి 1980లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒరిస్సాలో కొలువై ఉన్న జనతా ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు పెట్టడంతో నందిని నాయకత్వాన కాంగ్రెస్(ఆర్స్) పోటీ చేయగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఎన్నికల్లో తన పాత నెచ్చెలిపై సాధించిన విజయం ఇందిరాను బాగా సంతోషపెట్టింది. అయితే, సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు ఇందిరాను ఓదార్చిన వ్యక్తుల్లో నందిని మొదటివారు. ఇందిరా చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరమని రాయబారాలు పంపినప్పటికి నందిని సున్నితంగా తిరస్కరించారు. కాంగ్రెస్ (ఆర్స్) 1984 నాటికి ఇందిరా కాంగ్రెస్లో కలవడంతో నందిని స్వతంత్రంగా కొనసాగారు.
1985 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒరిస్సా వచ్చిన ప్రధాని రాజీవ్ తన సన్నిహితుల ద్వారా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరమని కోరినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరించారు. అయితే, 1989 నాటికి రాజీవ్ రాజకీయంగా బలహీన పడుతున్న సమయంలో అయన కోరికను మన్నించి దాదాపు దశాబ్దం తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1990,1995 ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. 1995 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాజకీయాలకు క్రమంగా దూరం జరుగుతూ వచ్చారు.
1962-72 వరకు రెండుసార్లు రాజ్యసభకు, 1974-2000 మధ్యలో ధెనేకుల్, గోండియా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వరసగా ఆరు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆమె ఏనాడు ఒక్కసారిగా కూడా ఓటమి చూడలేదు. నెహ్రూ నుంచి రాజీవ్ వరకు ఎందరో ప్రధానులతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరియు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ మహిళా నేతలకు సైతం ఇందిరా గాంధీ తర్వాత ఆమె ఆరాధ్యనీయమైన రాజకీయ నాయకురాలు. మాజీ ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కబెట్టడానికి మెళుకువలు, సూచనలు కూడా ఇచ్చారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
నందిని రాజకీయవేత్తనే కాదు గొప్ప రచయిత. తండ్రి నుంచి వారసత్వంగా సాహిత్య రచనను పుణికి పుచ్చుకున్న ఆమె రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నా, ఇతర భాషల్లోని ప్రముఖ రచనలను ఒరియాలోకి తర్జమా చేశారు. అంతేకాకుండా, ఒరియాలో వందల కవితలు, చిన్న కథలు రచించారు. "కలనా" పేరుతో సాహిత్య మాస పత్రికను స్థాపించి, సంపాదకురాలిగా పనిచేశారు. చివరగా ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నజ్రిన్ రాసిన "లజ్జ" నవలను ఒరియాలోకి అనువదించారు. ఒరియా సాహిత్యానికి ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ 1998వ సంవత్సరంలో సాహిత్య భారతి సమ్మాన్ అవార్డును ఒరిస్సా ప్రభుత్వం ప్రదానం చేసింది.
నందిని వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె భర్త దేవేంద్ర సత్పతి ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు. కాలేజీ రోజుల్లో విద్యార్ధి ఉద్యమాల్లో కలిసి పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. నందిని కాంగ్రెస్ పార్టీలో చేరినా దేవేంద్ర మాత్రం వామపక్షాలు, సోషలిస్టులతో కలిసి గిరిజన కార్మికుల సంక్షేమం కోసం పనిచేసేవారు. ప్రముఖ ఒరియా దిన పత్రిక "ధరిత్రి"ని స్థాపించి వ్యవస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. 1971,1977లలో ధెనేకుల్ లోక్ సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నందిని రాజకీయాల్లో బిజీగా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచారు. తన రాజకీయ జీవితం విజయవంతం కావడంలో తన భర్త పాత్ర మరువలేనిదని ఆమె పలు మార్లు పేర్కొన్నారు. వారికీ ఇద్దరు అబ్బాయిలు. చిన్నవాడైన తగథా సత్పతి తల్లిదండ్రుల బాటలో సాహిత్య, రాజకీయ రంగాల్లో రాణించారు. ప్రస్తుతం కుటుంబ వ్యాపారాల్లో బిజీగా గడుపుతున్నారు.
నిరక్ష్యరాస్యత, పేదరికం, కఠినమైన సాంఘిక ఆంక్షలుండే తూర్పు భారతదేశం నుంచి వచ్చి నందిని అర్థ శతాబ్దం పాటు రాజకీయాల్లో పురుషాధిక్యతను దీటుగా ఎదుర్కొని ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒరియా రాజకీయాల్లో ఆమె తర్వాత కానీ, ముందు ఎవరు సాధించలేని పేరు, ప్రఖ్యాతలు సాధించారు. చివరి మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ అనారోగ్యం కారణంగా తన 75 ఏట 2006,ఆగస్టు 6న భువనేశ్వర్‌లో కన్నుమూశారు. ఆమె స్మారకార్థం ప్రతి ఏటా జూన్ 9న జాతీయ బాలికల దినోత్సవాన్ని ఒరిస్సాలో "నందిని దివస్"గా నిర్వహిస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా