ల్యూటెన్స్ మీడియా కింగ్ మేకర్-టి.వి.ఆర్ షెనాయ్

- June 10, 2025 , by Maagulf
ల్యూటెన్స్ మీడియా కింగ్ మేకర్-టి.వి.ఆర్ షెనాయ్

టి.వి.ఆర్ షెనాయ్...భారతదేశ జర్నలిజం అభివృద్ధికి దోహదపడిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి. కేరళలోని చిన్న పట్టణం నుంచి వెళ్లి ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్న ఏకైక కేరళ జర్నలిస్టు షెనాయ్. అంతర్జాతీయ వార్తలు నుంచి గల్లీ వార్తల వరకు ఆయనకు తెలియని అంశం అంటూ ఏది ఉండేది కాదు. హస్తినలో జర్నలిజం సమూహం నుంచి భాజపాకు బలమైన మద్దతుదారుగా నిలబడ్డ మొదటి వ్యక్తి కూడా ఆయనే. ల్యూటెన్స్ మీడియా, రాజకీయ వర్గాల ద్వారా పనిచేయించుకోవడం తెలిసిన ఏకైక వ్యక్తి. నేడు ఇండియా వెటరన్ జర్నలిస్టు టి.వి.ఆర్ షెనాయ్ జయంతి సందర్భంగా ప్రత్యెక కథనం..

 షెనాయ్ సాబ్ లేదా మనోరమ షెనాయ్‌గా సుపరిచితులైన టి.వి.ఆర్ షెనాయ్ పూర్తిపేరు తాలియాత్ పరంబిల్ విట్టప్ప రామచంద్ర షెనాయ్. 1941, జూన్ 10న ఒకప్పటి కొచ్చిన్ రాజ్యంలో (ప్రస్తుతం కేరళ) భాగమైన కొచ్చిన్ పట్టణానికి దగ్గరలోని చేరాయి అనే చిన్న పట్టణంలో కొంకణి కుటుంబంలో జన్మించారు. కొచ్చి మహారాజా కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాలేజీలో ఉన్న సమయంలో    మాజీ కేంద్ర మంత్రులైన వయలార్ రవి, ఏకే ఆంటోనిలు ఆయనకు సమకాలికులు.

 60వ దశకం మధ్యలో షెనాయ్ జర్నలిజంలోకి అడుగుపెట్టారు. మలయాళ మనోరమ పత్రిక ద్వారా జర్నలిస్టుగా మారిన ఆయన 1968లో ఢిల్లీకి ఆ పత్రిక ప్రతినిధిగా వెళ్లారు. అది మొదలు ఆయన చివరి శ్వాస వరకు ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉన్న సమయంలో కేవలం మనోరమ పత్రికకే కాకుండా పలు ఇంగ్లీష్ పత్రికలకు కాలమ్స్ రాసేవారు. "లాస్ట్ వర్డ్" పేరుతో ఆయన రాసిన కాలమ్, అప్పట్లో చాలా ఫెమస్. ఢిల్లీ వెళ్లిన తర్వాత 1971 ఇండియా - పాకిస్తాన్ యుద్ధాన్ని కవర్ చేసిన అతికొద్ది మంది జర్నలిస్టులో ఆయన ఒకరు. ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా జరిగిన అవినీతి కుంభకోణాలు, ఎమెర్జెన్సీ సమయంలో జరిగిన అరాచకాలు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మరియు స్టాక్ మార్కెట్ స్కామ్స్ , బోఫార్స్ యుద్ధ విమానాలు, బాబ్రీ మసీదు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కవర్ చేసిన బ్రేకింగ్, ఎక్స్లూజివ్ వార్తలకు లెక్కే లేదు.

ఢిల్లీలోని ల్యూటెన్స్ మీడియాలో వామపక్ష భావజాలాన్ని వంటి నిండా నింపుకున్న జర్నలిస్టు సమూహాన్నికాదని అప్పుడే ఉదయిస్తున్న రైట్ వింగ్ జర్నలిజానికి షెనాయ్ ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టారు. తానూ పనిచేస్తున్న మనోరోమ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అయినప్పటికి తను మాత్రం జనసంఘ్, ఆరెస్సెస్ సంస్థలకు మద్దతుదారుగా ఉండేవారు. కె.ఆర్.మల్కాని, అటల్ బీహారీ వాజపేయ్ మరియు అద్వానీలతో సన్నిహితంగా మెలిగేవారు. ముఖ్యంగా వాజపేయ్ మితవాద భావజాలానికి ఆకర్షితులైన మొదటి ఇంగ్లీష్  జర్నలిస్టు కూడా వీరే కావడం విశేషం. 80వ దశకం చివరి నాటికి భాజపా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఊహించడమే కాకుండా తన సన్నిహితుల వద్ద పదేపదే ప్రస్తావించేవారు.

ల్యూటెన్స్ మీడియా వర్గాలు మొదటి నుండి హిందుత్వ రాజకీయ సిద్ధాంతం పట్ల ఆసక్తి చూపేవి కావు. కానీ, షెనాయ్ ఒక్కసారిగా వారి అయిష్టాన్ని కొద్దికొద్దిగా పోగొట్టి వారి వార్తలకు విస్తృతమైన కవరేజ్ ఇప్పించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మీడియాలోకి వచ్చిన వివిధ పత్రికల యంగ్ జర్నలిస్టులకు ఆయన మార్గదర్శనం చేస్తూ ఉండేవారు. ఆయన సహచర్యంలో యువ జర్నలిస్టులు కఠినమైన వామపక్ష భావజాలం వైపు పోకుండా సెంట్రిస్ట్ భావజాలంలోనే ఉండేవారు.షెనాయ్ మార్గదర్శనంలో 90వ దశకంలో భాజపా అగ్రనేతలైన  వాజపేయ్, అద్వానీలకు దొరికినంత మీడియా కవరేజీ మారే పార్టీకి దక్కలేదు. అలా కరుడుగట్టిన ల్యూటెన్స్ వర్గాలను ప్రభావితం చేస్తూ భాజపాకు ఉచిత ప్రచారం చేయించారు.

షెనాయ్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా 1996లో వాజపేయ్ 13 రోజుల పాలన సమయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, వ్యవధి తక్కువగా ఉండటంతో పార్టీలను సమీకరించడంలో విఫలం అయ్యారు. అయితే 1996-98 మధ్యలో ప్రాంతీయ పార్టీలను భాజపాతో పొత్తు కుదర్చడానికి పున్నకున్నారు. అకాళీదళ్, తెదేపా, ఎన్సీ, అన్నా డీఎంకే మరియు ఇతర చిన్నా చితక ప్రాంతీయ పార్టీలను భాజపాకు చేరువ చేశారు. 1998లో భాజపా నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో భాజపా నేతలైన ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీలతో పాటుగా షెనాయ్ మీడియా వర్గాల నుంచి కీలకమైన పాత్ర పోషించారు. 1999లో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిన తర్వాత కూడా ఆ ఏడాదే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ భాజపా అధికారాన్ని అందుకోవడానికి మీడియా ప్రచార నిర్వహణ మొత్తాన్ని తన భుజాల మీద మోశారు. ఆ విధంగా తన మిత్రుడైన వాజపేయిని మూడోసారి ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టడంలో తనవంతు పాత్ర పోషించారు.

1998 నుంచి 2004 వరకు ల్యూటెన్స్ మీడియా వర్గాన్ని షెనాయ్ శాసించారు. కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి పదవి చేపట్టకుండానే నేరుగా ప్రధానమంత్రిని కలుసుకోగలిగే స్థాయికి చేరుకున్న ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి వామపక్ష భావజాలం కలిగిన జర్నలిస్టు  ఉద్దండులు సైతం తమ వైరుధ్యాలను, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి మరీ ప్రభుత్వానికి సానుకూలంగా వార్తలు రాయడం స్టార్ట్ చేశారు. అలాగే, తన కోసం పనిచేసిన జర్నలిస్టులకు ప్రభుత్వంలో ఉన్న సీనియర్ మంత్రులతో, కీలక పాలసీ మేకర్స్‌తో ఇంటర్వ్యూస్ ఇప్పించారు. టీవీ జర్నలిస్టులుగా మారిన వారైతే షెనాయ్ అనుమతి లేనిదే ఇంటర్వ్యూలు చేయాలేని పరిస్థితి. ఇదే సమయంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వేతనాలు పెంచే చట్టాలు, వారికి గుర్తింపు కార్డులు, ఇళ్ళ స్థలాలు వంటి ఎన్నో ఫెవర్స్ కూడా చేశారు.

షెనాయ్ అత్యంత పవర్ ఫుల్ మీడియా మ్యాన్‌గా ఉన్నప్పటికి వ్యక్తిగతంగా మాత్రం స్నేహశీలి. వృత్తి పరంగా, సిద్ధాంతాల పరంగా ఆయన్ని విభేదించిన వారు కూడా వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలిగేవారు. తన కంటే తర్వాత ఢిల్లీ వచ్చిన జర్నలిస్టులకు మీడియా మెళుకువలు, వార్తను కనుక్కొనే పద్ధతులు నెరిపేవారు. అంతర్జాతీయ స్థాయి వ్యవహారాల నుంచి పురాణాల వరకు ఆయనకున్న విస్తారమైన విషయ పరిజ్ఞానం మూలంగా ఆయన్ని "ఇండియన్ జర్నలిజం వాకింగ్ ఎన్సైక్లోపీడియా"గా పిలుచుకునేవారు. అధికారంలోకి ఎవరు వచ్చినా షెనాయ్ సిఫారసు చేసి పని ఆగడం అనేది ఎప్పుడు జరగలేదని ఆయన సన్నిహితులే చెబుతారు.

ఐదున్నర దశాబ్దాల జర్నలిజం కెరీర్లో షెనాయ్ పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. జర్నలిజం రంగానికి చేసిన విస్తృతమైన సేవలను గుర్తిస్తూ 2003లో కేంద్రం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయన పిల్లలు కూడా తండ్రి బాటలోనే జర్నలిజంలో అడుగుపెట్టారు. అనారోగ్యం కారణంగా 2018, ఏప్రిల్ 17న తన 77వ ఏట కన్నుమూశారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com