ఇజ్రాయెట్ దురాక్రమణ..ప్రాంతీయ భద్రతకు ముప్పు: 20 ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!

- June 18, 2025 , by Maagulf
ఇజ్రాయెట్ దురాక్రమణ..ప్రాంతీయ భద్రతకు ముప్పు: 20 ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!

కైరో: సౌదీ అరేబియాతో సహా ఇరవై అరబ్, ఇస్లామిక్ దేశాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ దేశాల విదేశాంగ మంత్రులు ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రమాదకరమైన తీవ్రతపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రులు తక్షణ కాల్పుల విరమణతో ఉద్రిక్తతను తగ్గించాలని పిలుపునిచ్చారు. ఈ డిక్లరేషన్ పై సంతకం చేసిన దేశాలలో సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, బహ్రెయిన్, బ్రూనై దారుస్సలాం, టర్కీ, చాడ్, అల్జీరియా, కొమొరోస్ యూనియన్, జిబౌటి, సూడాన్, సోమాలియా, ఇరాక్, ఒమన్, ఖతార్, కువైట్, లిబియా, మౌరిటానియా ఉన్నాయి.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడాన్ని అంతర్జాతీయ చట్టం, UN చార్టర్ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆయా దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల  సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఇలాంటి చర్యలు దెబ్బతీస్తుందన్నారు. వివాదాల శాంతియుత పరిష్కారాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా మధ్యప్రాచ్యాన్ని అణ్వాయుధాలు, సామూహిక విధ్వంసక ఆయుధాలు లేని జోన్‌గా మార్చే ప్రాముఖ్యతను విదేశాంగ మంత్రులు స్పష్టం చేశారు. అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT)లో ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు చేరాలని వారు కోరారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా నిబంధనల ప్రకారం అణు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏకగ్రీవంగా తిరస్కరించారు. ఇది 1949 జెనీవా సమావేశం ప్రకారం అంతర్జాతీయ, మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి.

ఇరాన్ అణు కార్యక్రమంపై స్థిరమైన ఒప్పందాన్ని చేరుకోవడానికి ఏకైక మార్గంగా వీలైనంత త్వరగా చర్చలను తిరిగి ప్రారంభించాలని విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాలలో నావిగేషన్ స్వేచ్ఛను గౌరవించడం, సముద్ర భద్రతకు ఏదైనా ముప్పును నివారించడం యొక్క ప్రాముఖ్యతను వారు చెప్పారు.

ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించడానికి దౌత్యపరమైన పరిష్కారాలు, సంభాషణలు మాత్రమే మార్గమని ఇస్లామిక్ దేశాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో అన్ని దేశాలు UN చార్టర్‌కు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. సైనిక పరిష్కారాలు సంక్షోభ పరిష్కారానికి దోహదపడవని మరోసారి వారు పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com