అభిమాన అగ్రేసరుడు-స్వామి నాయుడు
- June 20, 2025
సినిమా రంగంలో అగ్రశ్రేణి నటుడిగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి నటనలోనే కాదు..ప్రజా సేవలోనూ ముందుంటారు. అందులో భాగంగానే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ కింద బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది కంటి చూపును పొందగా.. లక్షలాది మంది ఆపద సమయాల్లో ఉచితంగా రక్తాన్ని పొందారు. అంతేకాదు, ప్రజల్లో రక్తదానంపై ఉన్న అపోహల్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో చిరంజీవి వీరాభిమాని, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ ను ఒక్కతాటిపై దశాబ్దాలుగా నడిపిస్తున్న తీరు అమోఘం. ఇదంతా ఆయనకు చిరంజీవిపై ఉన్న అపారమైన ప్రేమ, అభిమానం కారణం.చిరంజీవికి స్వామినాయుడు అభిమాని అనేకంటే భక్తుడు అనడం సబబు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన స్వామి నాయుడు, కాకినాడలో పాలిటెక్నిక్ పూర్తి చేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. వ్యాపారంతో పాటుగా చిరంజీవి సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఆయన పెద్ద పెద్ద ఊరేగింపులు నిర్వహించేవారు. అన్నయ్య పై అభిమానం రోజురోజుకు పెరుగుతున్న కొద్దీ వ్యాపారాల మీద ఆసక్తి చూపలేకపోయారు. మద్రాస్ కావొచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ కావొచ్చు ఇలా ఎక్కడ ఉన్నా చిరంజీవిని కలవడం ఆయనకు ఎంతో ఇష్టమైన వ్యాపాకంగా మార్చుకున్నారు.
2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదట చేరిన నాయకుల్లో వీరు ఒకరు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక స్థోమత లేకున్నా చిరంజీవే స్వయంగా ఆయన్ని రాజమండ్రి రూరల్ నుంచి అభ్యర్థిగా బరిలో నిలిపి ఎన్నికల ఖర్చులకు ఆర్థిక తోడ్పాటును సైతం అందించారు. ఆ ఎన్నికల్లో స్వామి నాయుడిని విజయ లక్ష్మి వరించకున్నా, చిరంజీవితో శాశ్వత ప్రయాణం చేసేందుకు దోహదపడింది. చిరంజీవితోనే రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి, ఆయనతోనే ఆ ప్రయాణాన్ని ముగింపు పలికారు.
నాయుడు చిరంజీవి హీరోయిజానికే కాదు, ఆయన సేవా స్ఫూర్తికి అభిమాని. రాష్ట్రంలో చిరంజీవికి ఉన్న లక్షలాది అభిమానులు వేలల్లో ఏర్పడిన అభిమాన సంఘాలను పర్యవేక్షించే బాధ్యతను చిరంజీవి స్వామినాయుడుకు అప్పగించారంటే ఆయనలో ఎంతటి నిబద్ధత ఉందో అర్ధం చేసుకోవచ్చు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు తర్వాత విస్తృతమైన రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలను నిబద్ధతతో నిర్వర్తించి అభిమానుల్ని ఒక్కతాటిపై నిలిపి.. చిరంజీవి సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
చిరంజీవి ఆదేశాల మేరకు బ్లడ్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి(COO)గా బాధ్యతలు చేపట్టి, తన అభిమాన నటుడి ఆదర్శాలకు అనుగుణంగా సంస్థను నడిపిస్తూ చిరంజీవి ప్రశంసలు అందుకున్నారు. సంస్థ తరుపున రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు స్వామి నాయుడు.
బ్లడ్ బ్యాంక్ గురించి చిరంజీవి మాట్లాడుతూ అభిమానులకు ప్రత్యుపకారంగా ఏదో ఒకటి చేయాలని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ విజయవంతంగా ముందుకు వెళుతోందంటే గొప్ప మనసు ఉన్న నా అభిమానులు, ఎందరో దాతలు సహకరించి నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం వల్లేనని చెప్పుకొచ్చారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!