నిమిష ప్రియకేసులో తాజా అప్‌డేట్

- October 16, 2025 , by Maagulf
నిమిష ప్రియకేసులో తాజా అప్‌డేట్

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్షపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమెకు విధించిన మరణశిక్షపై ప్రస్తుతం స్టే కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం గురువారం తెలిపింది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి తీవ్రమైన పరిణామాలు జరగలేదని పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారతీయ నర్సును కాపాడేందుకు కేంద్రం దౌత్యమార్గాలను వాడుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

తాజాగా సుప్రీంకోర్టు ఆమె మరణశిక్ష గురించి ప్రశ్నించింది. దీంతో ఆమెకు చట్టపరమైన సహకారం అందిస్తోన్న ‘సేవ్ నిమిషప్రియ(Nimisha Priya) ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్‌’ తరఫు న్యాయవాది దీని గురించి మాట్లాడారు. నిమిష ప్రియ మరణశిక్ష అమలుపై స్టే కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసులోకి కొత్త మధ్యవర్తి వచ్చారని కేంద్రం తరఫు అటర్నా జనరల్‌ వెంకటరమణి తెలిపారు. మంచి విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఎలాంటి తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకోలేదని చెప్పారు. చివరికి ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ కేసును వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. ఏవైనా అత్యవరస పరిస్థితులు తలెత్తితే ముందుస్తు జాబితా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అనంతరం 2008లో యెమెన్‌కు వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో చేరారు. అయితే ఆ దేశ రూల్స్‌ ప్రకారం స్థానిక వ్యక్తి తలాల్ అదిబ్ మెహది భాగస్వామ్యంతో ఓ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను స్థాపించారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి నిమిష ప్రియను వేధించడం, పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లను లాక్కున్నాడనే ఆరోపణలున్నాయి. 2016లో ఆమె తలాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.ఈ క్రమంలోనే తన పాస్‌పోర్టు తీసుకోవాలని అనుకున్న నిమిష 2017లో తలాల్‌ మెహదికి మత్తుమందు ఇచ్చింది.కానీ దాని డోసు ఎక్కువ కావడంతో తలాల్ మెహదీ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నిమిష అతడి మృతదేహాన్ని వాటర్‌ ట్యాంక్‌లో పడేసింది. అక్కడి నుంచి సౌదీ పారిపోతుండగా సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. చివరికి మరణశిక్ష విధించారు. ఈ ఏడాది జులై 26న ఈ శిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో భారత ప్రభుత్వం, మత పెద్ద ప్రయత్నాల వల్ల ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com