సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్

- October 16, 2025 , by Maagulf
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్

హైదరాబాద్: సోషల్ మీడియా ప్రపంచం విస్తృతమవుతున్న కొద్దీ, కంటెంట్ సృష్టికర్తల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే, కొంతమంది సృష్టికర్తలు ‘వ్యూస్’, ‘లైక్స్’ కోసం పరిగెడుతూ నైతిక విలువలను మరిచిపోతున్నారు.ఈ నేపథ్యంలో, తెలంగాణ పోలీసు శాఖ  సోషల్ మీడియాలో అనుచితమైన కంటెంట్‌ను సృష్టించే వారికి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

ముఖ్యంగా, చిన్నారులను ఉపయోగించి అసభ్యకరమైన లేదా అనుచితమైన వీడియోలు రూపొందించడం, వాటిని పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేయడం వంటి చర్యలు నేరమని పోలీసులు స్పష్టంగా ప్రకటించారు.ఇటువంటి చర్యలు బాలల భవిష్యత్తును, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, క్షమార్హం కాని చట్టపరమైన నేరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

చిన్నారులను ఉపయోగించి కంటెంట్‌ను రూపొందించేవారు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారి భవిష్యత్తును పణంగా పెడుతున్నారని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇటువంటి వీడియోలు సమాజానికి ఎటువంటి సానుకూల సందేశాన్ని ఇవ్వకపోగా, పిల్లలను, యువతను పెడదోవ పట్టించే ప్రమాదం ఉందన్నారు.

ఈ చర్యలు కేవలం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదని.. బాలలపై లైంగిక నేరాల నివారణ (POCSO) చట్టం, 2012, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం, 2015 వంటి బాలల సంరక్షణ చట్టాలను ఇటువంటి కంటెంట్ ఉల్లంఘిస్తుందన్నారు. మైనర్లతో ఈ తరహా అనుచిత కంటెంట్‌ను చేయించటం స్పష్టంగా ‘చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్’ కిందకు వస్తుందన్నారు.

మైనర్లతో అసభ్యకర కంటెంట్ సృష్టించే వారిపట్ల ఉపేక్షించబోమని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే అప్‌లోడ్ చేసిన వీడియోలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినా, చిత్రీకరించినా బాధ్యులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.

సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలు వ్యూస్‌పై దృష్టి పెట్టకుండా.. చిన్నారులకు, యువతకి స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేయడం లేదా సామాజికాభివృద్ధికి దోహదపడే కంటెంట్‌ను రూపొందించడం ద్వారా తమ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాలో అనుచిత కంటెంట్ మీ దృష్టికి వచ్చినట్లయితే, వెంటనే దాన్ని రిపోర్ట్ చేయాలని, లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు. ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయవచ్చునని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

తల్లిదండ్రులుగా తమ పిల్లలను పెంచడం మాత్రమే కాకుండా వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం తమ ప్రధాన బాధ్యత అని గుర్తుంచుకోవాలని సూచించారు. తమ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచి, వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించాలని సీపీ సజ్జనార్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com