స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు

- October 16, 2025 , by Maagulf
స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరోసారి భారత క్రికెట్‌కు గౌరవం తీసుకువచ్చారు.ఈ ఇద్దరూ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు అందుకున్నారు. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నీలో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచి ఈ అవార్డును గెలుచుకున్నారు.

ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 200 స్ట్రైక్‌రేట్, 44.58 సగటుతో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ అందుకున్నాడు. అతని విధ్వంసంతో ఈ టోర్నీలో టీమిండియా ఏకపక్ష విజయాలు నమోదు చేసి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కూడా కొనసాగుతున్నాడు.ఈ ప్రదర్శనతో అభిషేక్ శర్మ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌కు నామినేట్ అయ్యాడు. అతనితో పాటు ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ కూడా ఈ అవార్డ్ రేసులో నిలిచాడు.

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణించిన జింబాబ్వే ప్లేయర్ బ్రియాన్ బెన్నెట్ కూడా పోటీ పడగా.. అభిషేక్ శర్మకే ఈ అవార్డ్ వరించింది. అభిషేక్ శర్మ కెరీర్‌లో ఇదే తొలి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కావడం గమనార్హం. ఈ అవార్డ్ గెలుచుకోవడంపై అభిషేక్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు.’ఈ ఐసీసీ అవార్డ్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది.

కీలకమైన మ్యాచ్‌లు గెలిపించినందుకు ఈ అవార్డు దక్కడం మరింత ఆనందంగా ఉంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా విజయాలను అందుకునే జట్టులో భాగంగా ఉన్నందుకు గర్వంగా ఉంది. టీ20 ఫార్మాట్‌ లో ఇటీవల మేం సాధించిన విజయాలు.. మా టీమ్ కల్చర్, పాజిటివ్ మైండ్ సెట్‌కు ప్రతిబింబం.’అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మంధాన అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 58, 117, 125 పరుగులతో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల్లో 77 సగటుతో 308 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో మంధాన 50 బంతుల్లోనే సెంచరీ బాది ఆకట్టుకుంది.మంధానతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్,

పాకిస్థాన్ ప్లేయర్ సిద్రా అమిన్ ఈ అవార్డ్ రేసులో నిలవగా మంధాననే వరించింది. ఈ అవార్డు తనకు ప్రోత్సాహకం వంటిదని మంధాన తెలిపింది. ఇలాంటి అవార్డులు తన ఆట మరింత మెరుగయ్యేందుకు ఉపయోగపడుతాయని చెప్పింది. తన లక్ష్యం ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం, జట్టుకు విజయాలు అందించడమేనని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com