విశాఖ: యోగాంధ్ర‌కు స‌ర్వం సిద్దం…

- June 20, 2025 , by Maagulf
విశాఖ: యోగాంధ్ర‌కు స‌ర్వం సిద్దం…

విశాఖప‌ట్నం: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.రేపు న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఘనంగా వేడుకలను జరపనున్నారు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననుండడంతో దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

విశాఖలోని ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు మొత్తం 127 కంపార్ట్‌మెంట్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌ 200×14 మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతుంది. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో వెయ్యిమంది చొప్పున పాల్గొననున్నారు. ప్రతి సెక్షన్‌కు ఒక ఇన్‌చార్జ్, వైద్య సిబ్బంది, పదిమంది వాలంటీర్లు ఉంటారు. ఎల్ఈడీ స్క్రీన్లు, మైకులు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టమ్‌లతో పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

అంతే కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. యోగాంధ్ర సందర్భంగా మొత్తం 22 రికార్డులను సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు సంబంధించినవి ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025లో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్య నమస్కార కార్యక్రమం ఉండబోతుంది. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే.. ఆర్కే బీచ్ రోడ్డులో కార్యక్రమాలు రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది.

వాతావరణం అనుకూలంగా ఉంటే ఆర్కే బీచ్ రోడ్డులో గిన్నిస్ రికార్డు పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏయుకు వచ్చి విద్యార్థుల సూర్య నమస్కారాలను పది నిమిషాల పాటు పరిశీలిస్తారు. ఏజెన్సీ నుండి గిరిజన విద్యార్థులను 106 పాఠశాలల నుంచి 495 బస్సుల్లో విశాఖకు తీసుకువస్తున్నారు. ముందుగా 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 1.08 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేయించనున్నారు.యోగ దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సూర్య నమస్కార కార్యక్రమం నిలవనుంది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును ఏపీ ప్రభుత్వం సాధించనుంది. రాష్ట్ర‌ వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ఒకేసారి యోగా చేయడం, ఒకే ప్రదేశంలో 3 లక్షల మందితో యోగా చేయడం వంటి రికార్డులపై దృష్టి సారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com