విశాఖ యోగాంధ్ర-2025కు గిన్నిస్‌ రికార్డు..

- June 21, 2025 , by Maagulf
విశాఖ యోగాంధ్ర-2025కు గిన్నిస్‌ రికార్డు..

విశాఖపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఒకే స్ట్రెచ్‌లో మూడు లక్షల 20వేల మందికి పైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు.దీంతోపాటు 25వేల మంది గిరిజన విద్యార్థులు శుక్రవారం ఒకేచోట చేసిన సూర్య నమస్కారాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలను అందజేశారు.

గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును (1.47లక్షల మంది) ప్రస్తుతం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 అధిగమించింది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ లకు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలను నిర్వాహకులు అందజేశారు.

విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025కు గిన్నిస్ వరల్డ్ రికార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కోరికలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని, ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర విజయవంతమైందని, ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలు భారీఎత్తున పాల్గొన్నారని లోకేశ్ పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐటీ హబ్ గా విశాఖపట్టణంను తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com