అంతర్జాతీయ యోగా దినోత్సవం

- June 21, 2025 , by Maagulf
అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఈ రోజుల్లో మానసిక ఒత్తిడితో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు.దాంతో జీవక్రియలు నెమ్మదించడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాంటి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఏంతో ఉపయోగపడుతుంది. ఒత్తిడి, నిద్రలేమి, పనిభారంతో ఈ రోజుల్లో అనేక మంది నేడు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది జీవితాల్లో యోగా ఓ భాగమైంది. దీనివల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చనని నిపుణులు చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

భారతీయ సంస్కృతిలో ఆరోగ్యం అనేది కేవలం శారీరక రోగాల లేమి కాదు, అది సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును అందిస్తోంది. ఆయుర్వేదం, యోగా, సిద్ధ, ప్రకృతి చికిత్స వంటి ప్రాచీన భారతీయ వైద్య విధానాలు ఈ సమగ్ర ఆరోగ్య భావనకు నిదర్శనం.  భారతీయ కుటుంబ వ్యవస్థ, ఆహార పద్ధతులు, పండుగలు, పర్యావరణంతో అనుసంధానం ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడ్డాయి.ఉదాహరణకు, సంప్రదాయ భారతీయ ఆహారం పోషకాలతో నిండి ఉంటుంది.రుతువులకు అనుగుణంగా మారుతుంది. శరీరం, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.  

యోగా.. భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం నుంచి ఉద్భవించిన ఒక గొప్ప జీవన తత్వం.  వేద కాలం నాటి నుంచీ యోగా భారతదేశంలో ఒక జ్ఞాన మార్గంగా, ఆధ్యాత్మిక సాధనగా వికసించింది.  ‘వసుధైక కుటుంబం’,  ‘సర్వే జనాః సుఖినో భవంతు’వంటి విశాలమైన, సార్వత్రిక భావనలు ఇప్పుడు ప్రపంచానికి అత్యంత అవసరమవుతున్నాయి. ఈ ప్రాచీన భావనలు ఆధునిక ప్రపంచంలోని సవాళ్లకు సమాధానాలు అందించగలవు.  యోగా ద్వారా భారతదేశం కేవలం భౌతికంగానే కాకుండా, ఆధ్యాత్మికంగా, మానసికంగా ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలుస్తోంది.

యోగాను కేవలం ఒక వ్యాయామ పద్ధతిగా కాకుండా,సంపూర్ణ జీవన విధానంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ‘ఒకే భూమి  ఒకే ఆరోగ్యం’ అనే మహత్తర నినాదంతో  ముందుకు వచ్చింది.ఈ నినాదం కేవలం శారీరక, మానసిక ఆరోగ్యాల ఆవశ్యకతను మాత్రమే కాదు..అంతకు మించి ప్రకృతితో మమేకమై జీవించడం, మానవీయ విలువలను నిలబెట్టడం, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం,  వేగవంతమైన సాంకేతికతతో కూడిన ఆధునిక జీవనశైలి మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించాల్సిన అనివార్యతను స్పష్టం చేస్తోంది.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, యోగా సాధన ఒక దీపస్తంభం వలె నిలుస్తుంది.ముఖ్యంగా ధ్యానం, ప్రాణాయామం,వివిధ రకాల ఆసనాలు ఈ ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించేందుకు ఉత్తమ మార్గాలుగా నిరూపితమయ్యాయి.యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.ఇది మనస్సుకు స్థిరత్వాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని,మానసిక ప్రశాంతతను అందిస్తోంది. ‘ఒకే భూమి. - ఒకే ఆరోగ్యం’ అనే నినాదం మన ఆరోగ్యం,భూమి, పర్యావరణ పరిరక్షణపై ఎంతగానో ఆధారపడి ఉందని స్పష్టం చేస్తోంది.ప్రస్తుత ప్రపంచం..వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, జల కాలుష్యం, వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలతో సహా తీవ్రమైన పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటోంది.ఈ పర్యావరణ క్షీణత  నేరుగా మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.  

కలుషితమైన గాలిని పీల్చడం, కలుషితమైన నీటిని తాగడం,రసాయనాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి.యోగా  జీవనశైలి పర్యావరణహితమైన జీవితానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది.ప్రకృతితో మమేకమై జీవించడం ద్వారా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలుగుతాం.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com