వైఎస్సార్ ఆత్మ-కెవిపి
- June 22, 2025
కెవిపి...ఈ మూడు అక్షరాలు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించాయి.దివంగత మాజీ సీఎం వైఎస్సార్ అనునయిగా ఉంటూ రాష్ట్ర పాలనా వ్యవస్థను తెరవెనుక నుండి కంట్రోల్ చేశారు. సంపన్న భూస్వామ్య కుటుంబాలతో పాటుగా రాచరిక బంధుత్వాలు కలిగిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికి తెరవెనుక రాజకీయాల్లో మాత్రం తనను మించిన గొప్ప వ్యూహకర్త లేరని అనేక మార్లు నిరూపించారు. కాంగ్రెస్ వాదిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎటువంటి పక్క చూపులు చూడకుండా ఇప్పటికి అదే పార్టీలో కొనసాగుతూ నెహ్రు-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూనే వస్తున్నారు. నేడు ప్రముఖ రాజకీయవేత్త కెవిపి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
కెవిపిగా సుపరిచితులైన కెవిపి రామచంద్రావు పూర్తి పేరు కోటగిరి వెంకట ప్రభాకర రామచంద్రావు. 1948, జూన్ 22న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో అమ్మమ్మగారింట జన్మించారు. స్వస్థలం మాత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం తాలూకా అంపాపురం గ్రామం. కోటగిరి సత్యనారాయణ రావు, సీతాదేవి ఆయన తల్లిదండ్రులు. బాల్యం, హైస్కూల్ వరకు నరసరావుపేటలోనే సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కాలేజీలో పీయూసి పూర్తి చేసి గుల్బర్గాలోని మహాదేవప్ప రామాపురే మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేరారు. అయితే, చివరి రెండు సంవత్సరాలు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్తి చేసి డాక్టర్ డిగ్రీని అందుకున్నారు.
కెవిపి సంపన్న భూస్వామ్య పద్మనాయక వెలమ కుటుంబానికి చెందిన వారు. నూజివీడు, గంపలగూడెం, ఉయ్యూరు, నరసరావుపేట జమీందారీ కుటుంబాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మేనమామ నరసరావుపేట దగ్గరలోని పెట్లూరివారిపాలెం
గ్రామానికి అజమాయిషీదారుగా ఉండేవారు. తండ్రి సత్యనారాయణ రావు గారు పద్మనాయక వెలమ చరిత్ర గ్రంథాన్ని రచించి, తన సొంత ఖర్చులతో ప్రచురించారు. కెవిపికి చిన్నతనంలోనే రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగి క్రమంగా అది వ్యసనంగా మారింది. పేట హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తమ మేనమామ కుటుంబానికి కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి ఉన్న సన్నిహిత పరిచయాలు కారణంగా ఆయనకు రాజకీయాల మీద మరింత ఇష్టం పెరిగింది.
లయోలా కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్ధి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత మెడిసిన్ కోసం గుల్బర్గా వెళ్లిన తర్వాత అక్కడ వైఎస్సార్ పరిచయం కెవిపి జీవితాన్ని మలుపు తిప్పింది. వైఎస్సార్ సన్నిహిత్యంలో కెవిపికి అక్కడే ఉన్న కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, అద్దంకి మాజీ ఎమ్యెల్యే గరటయ్య, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తండ్రి గారైన గొట్టిపాటి శేషగిరిరావులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీరందరి కంటే వైఎస్సార్ తోనే స్నేహ బంధానికి మించిన ఆత్మీయ సోదర బంధం ఏర్పడి తర్వాతి కాలంలో ఇరువురి రాజకీయ ఎదుగుదలకు దోహద పడింది.
వైఎస్ మెడిసిన్ పూర్తి చేసి తిరుపతికి హౌస్ సర్జెన్సీకి వెళ్లగా, కెవిపి మాత్రం విద్యార్ధి రాజకీయాల్లో ఉండిపోయి మెడిసిన్ తొందరగా పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత కష్టం మీద మెడిసిన్ పూర్తి చేసి, హౌస్ సర్జెన్సీ చేయడానికి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో చేరినా, అక్కడ కూడా విద్యార్ధి రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. 70వ దశకం మధ్యలో వైఎస్ యూత్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కెవిపి కూడా కాకినాడలో చదువుతూనే యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో ఉండేవారు. కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి శ్రీరామ సంజీవరావు వర్గంలో ఉంటూ రాజకీయాలు చేసేవారు. ఈ క్రమంలోనే హౌస్ సర్జెన్సీని పూర్తిచేసి రాజకీయాలవైపు నడిచారు.
వైఎస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లినా కూడా కెవిపి ఇందిరా వర్గంలోనే ఉన్నారు. 1978లో వైఎస్ పులివెందుల నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్యెల్యేగా ఎన్నికైన తర్వాత నుంచి కెవిపిని దగ్గరకు తీసుకున్నారు. కెవిపికి ఉన్న పరిచయాల ద్వారా రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ మారారు. 1979-80 ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి పోటీ చేసిన కెవిపి, అప్పటి కపిలేశ్వరం జమీందారు చంటి దొర చేతిలో ఓడిపోయారు. కెవిపి రాజకీయ జీవితంలో తోలి మరియు మలి ప్రత్యక్ష ఎన్నికల పోటీ. 1984లో వైఎస్ పీసీసీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న సమయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శిగా గాంధీ భవన్ వ్యవహారాలను పర్యవేక్షణ చేసేవారు.
1989లో వైఎస్ కడప నుంచి ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లిన పోయిన సమయంలోనే కెవిపి ఆయన వెంటే నడిచారు. 1989-99 వరకు ఢిల్లీలోనే వైఎస్ ప్రధాన అనుచరుడిగా పార్టీ హై కమాండ్ వద్ద పరపతి సంపాదించారు. 1999లో వైఎస్ రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ రావడంలో కెవిపి పాత్ర చాలా కీలకం. 1999లో వైఎస్ ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో వైఎస్ రెట్టింపు చేసేందుకు అహర్నిశలు కృషి చేశారు. పార్టీలో వైఎస్ అసమ్మతి వర్గం వేసే వ్యూహ ప్రతి వ్యూహాలను చిత్తుచేసి వైఎస్సార్‌ను అందరివాడుగా నిలిపారు. 2003లో వైఎస్ చేపట్టిన చేవెళ్ళ టూ ఇచ్ఛాపురం పాదయాత్రకు ఎటువంటి అవాంతరాలు కలుగకుండా యాత్రను విజయవంతం చేశారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చే బాధ్యతను వైఎస్ కెవిపిపై ఉంచడంతో ఆ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకోని అన్ని వనరులను సమకూర్చి ఆ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి పరోక్షంగా దోహదపడ్డారు.కెవిపి తన కోసం చేసిన సాయాన్ని మరువని వైఎస్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. పేరుకు సలహాదారుగా ఉన్నప్పటికి ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను, వైఎస్ ఆఫ్ ద రికార్డ్‌గా చెప్పే అన్ని పనులను పూర్తి చేసేవారు. ఆరోజుల్లో కెవిపికి ప్రభుత్వంలో పట్టు గురించి రాజధానిలో కథలు కథలుగా చెప్పేవారు. నామినేటెడ్ పోస్టుల నుంచి, కాంట్రాక్టుల మంజూరు వరకు ఆయనదే హవా. తమిళనాడులో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె నెచ్చెలి శశికళ ఎలాగైతో చక్రం తిప్పారో ఇక్కడ ఇప్పుడు రామచంద్రరావు కూడా అంతే.
కెవిపి అనుగ్రహం పొందిన వారు రాత్రికి రాత్రే వ్యాపారవేత్తలు, ఎంపీలు, మంత్రులు మరియు కోటీశ్వరులు అయ్యారు. ఢిల్లీలో కెవిపిని తన ప్రతినిధిగా ఉంచాలని భావించిన వైఎస్ 2008లో రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నా కెవిపి మాత్రం వైఎస్ దగ్గరే ఉండేవారు. 2004-09 వరకు కెవిపి అనధికార సీఎం తరహాలో వ్యవహరించారు. ప్రభుత్వం ద్వారా ఎవరికైనా లబ్ధి జరగాలంటే మొదట కెవిపినే కలిసేవారని, వైయస్ ఇంటికి విఐపిలు, విదేశీ అతిథులు వచ్చినా ఆయన తప్పక ఉండేవారు.
2009లో తిరిగి రెండోసారి సీఎం అయ్యి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించే వరకు వైఎస్‌తోనే ఉంటూ వచ్చారు. వైఎస్ మరణాంతర పరిస్థితుల్లో వస్తున్న మార్పులు గమనించి తొలుత వైఎస్ తనయుడు జగన్ పక్షాన నిలిచారు.అయితే, జగన్ వైఖరి నచ్చక ఢిల్లీకి పరిమితం అయ్యారు. ఢిల్లీలో తనకున్న పరిచయాల ద్వారా 2014 ప్రారంభంలోనే రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014-20 వరకు ఏపీకి ప్రత్యేకహోదా కోసం తనవంతు పోరాటం చేశారు. రాజ్యసభ పదవి కాలం ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని విడవకుండా, ఇప్పటికి పార్టీలోనే కొనసాగుతున్నారు.
కెవిపి - వైఎస్ స్నేహ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం వారి మధ్య స్నేహం ఏర్పడి, వైఎస్ మరణించే వరకు అయన ఆత్మలో ఆత్మగా కొనసాగారు. వైఎస్ రాజకీయాల్లో క్రియాశీలమైన నాటి నుంచి కెవిపి ఆయన తలలో నాలుకగా మారారు. ఆనాటి నుంచి చివరి వరకు ముఖ్యమైన నిర్ణయాల్లో వైఎస్ ఏనాడూ కెవిపి మాటను జవదాటిపోలేదు. కెవిపి కూడా అనవవసర విషయాల్లో తలదూర్చే రకం కాదు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు తనపై ఎన్ని ఆరోపణలు చేసినా చలించని మనస్తత్వం రామచంద్రరావుది. స్నేహ ధర్మంతో తాను చేసే ప్రతి చర్యను భగవంతుడు హర్షిస్తాడని ఆయన విశ్వాసం. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి మంతనాల్లో ఆయన ఎక్కువ సేపు గడుపేవారు. జర్నలిస్టుల మాటల్లోని మర్మాన్ని ఇట్టే గ్రహించి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటారు. ఈ విధమైన శ్రమ వైఎస్ పడకుండా కెవిపి ఆ బాధ్యతను తన మీద వేసుకున్నారు.
అనేక ధర్మాలతో పాటు స్నేహ ధర్మానికి మన పౌరాణిక ఇతిహాసాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ స్పీడు యుగంలో "స్నేహ బంధము, ఎంత మధురము" అనుకుంటూ దశాబ్దాల తరబడి ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా నేస్తానికి అన్ని సంగతులు చెప్పుకునే వారు చాలా అరుదు. రాజకీయ నాయకుల్లో అయితే అది మహా అరుదు. కానీ కెవిపికి, వైఎస్‌కు మధ్య ఉన్న స్నేహ బంధం ఎంతో సమున్నతమైనదనే చెప్పాలి.ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసి దశాబ్దాలకు పైగా మంచి స్నేహితులుగా జీవితంలోని అనేక తీపి, చేదు అనుభూతులను పంచుకుంటున్న ఈ ఇద్దరు మిత్రుల కథ నిస్సందేహంగా చరిత్రలో నిలిచిపోగలదు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!