యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి యూఏఈ ఎయిర్ ట్రాఫిక్ సాధారణంగానే ఉంది.కానీ సౌదీ ఎయిర్ ట్రాఫిక్ రెట్టింపు కంటే ఎక్కువైంది. “జూన్ 13 నుండి ఇరానియన్ - ఇరాకీ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో సాధారణంగా ఆ దేశాల గుండా ప్రయాణించే విమానాలకు కొత్త మార్గాలు అవసరం అయ్యాయి. గత వారంలో సౌదీ అరేబియా ఓవర్ ఫ్లైట్స్ రెట్టింపు అయ్యాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా విమానాల సంఖ్య దాదాపు 500 శాతం పెరిగింది.”అని ఫ్లైట్ రాడార్ 24(Flightradar24) తెలిపింది.

స్వీడన్‌కు చెందిన రియల్-టైమ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లైట్-టేకింగ్ సంస్థ ఒక ప్రకటనలో.. “గత వారం ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి యూఏఈ నుండి లేదా దాని విమాన ట్రాఫిక్‌లో గణనీయమైన తేడా కనిపించలేదు.” అని పేర్కొంది. ప్రాంతీయ యుద్ధం కారణంగా అనేక యూఏఈ, ఇతర గల్ఫ్ క్యారియర్‌లు కూడా వేర్వేరు గమ్యస్థానాలకు తమ విమానాలను రీ షెడ్యూల్ చేయడంతోపాటు పలు సర్వీసులను రద్దు చేశాయి.  

“యూరప్, ఉత్తర అమెరికాకు ఖతార్ విమానాలలో ఎక్కువగా ఇరాక్ మీదుగా వెళతాయి. ఫ్లైదుబాయ్ ఇరానియన్ గగనతలానికి ప్రాప్యత కోల్పోవడం వల్ల విమానయాన సంస్థ విమాన సర్వీసుల సమయాలు పెరిగాయి. ఎందుకంటే అది ఇప్పుడు దుబాయ్ ఉత్తరాన ఉన్న గమ్యస్థానాలకు చేరుకోవడానికి పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ గుండా తూర్పు వైపు ప్రయాణించాలి. ఉదాహరణకు, దుబాయ్ నుండి మాస్కోకు విమానయాన సంస్థ ప్రయాణపు సమయం ఐదు గంటల నుండి దాదాపు ఏడు గంటలకు పెరిగాయి. ”అని ఫ్లైట్‌రాడార్ 24 తెలిపింది. యూఏఈ గగనతలంలో విమానాల సంఖ్య రోజుకు సగటున 2,838 కాగా, ఈ వారం ఆ సంఖ్య రోజుకు 2,725 కు పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ ఓవర్ ఫ్లైట్‌లు మేలో రోజుకు సగటున 50 నుండి జూన్ 13 నుండి రోజుకు 280కి పెరిగాయి.   

గల్ఫ్ క్యారియర్‌లకు పెరుగుతున్న ఖర్చులు

ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్ అయిన ఎమిరేట్స్ మే 11-17 మధ్య అత్యధిక సంఖ్యలో 1,354 విమాన సర్వీసులను రన్ చేసింది. ఆ తరువాత ఖతార్ ఎయిర్‌వేస్ (1,225), ఫ్లైదుబాయ్ (841), టర్కిష్ ఎయిర్‌లైన్స్ (584), ఎతిహాద్ ఎయిర్‌వేస్ (542), ఎయిర్ అరేబియా (395), ఎయిర్ ఇండియా (331), సింగపూర్ ఎయిర్‌లైన్స్ (255), బ్రిటిష్ ఎయిర్‌వేస్ (212), పిఐఎ (197), కువైట్ ఎయిర్‌వేస్ (191), విజ్ ఎయిర్ అబుదాబి (156), లుఫ్తాన్స (145), గల్ఫ్ ఎయిర్ (137),  పెగాసస్ (105) ఉన్నాయి.

లండన్‌కు చెందిన స్ట్రాటజిక్ ఏరో రీసెర్చ్ చీఫ్ అనలిస్ట్ సాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా యూరోపియన్ విమానాలు నేరుగా ఇరాక్-ఇరాన్ వైమానిక ప్రాంతం కంటే సౌదీ -ఈజిప్షియన్ వైమానిక ప్రాంతం ద్వారా పశ్చిమానికి ప్రయాణిస్తున్నాయి.  అయితే యుఎస్‌కు వెళ్లే విమానాలు సీటెల్ , లాస్ ఏంజిల్స్ వంటి ప్రదేశాలకు చేరుకోవడానికి ముందు ఉత్తర ధ్రువం వైపు వెళ్లే ముందు పాకిస్తాన్ ద్వారా తూర్పు వైపుకు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయని తెలిపారు.  

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా విమానయాన సంస్థలు అధిక ఇంధన ఖర్చులను భరించాల్సి వస్తోందన్నారు.  దాంతో డిమాండ్ మేరకు సర్ ఛార్జీలను విధించడంతో టిక్కెట్ ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు.  యుద్ధం జరిగిన ఈ మొదటి వారంలో చమురు ధరలు బ్యారెల్‌కు $60 ఉండగా.. $74కి పెరిగింది. యుద్ధం కొనసాగితే, అది బ్యారెల్‌కు $100కి చేరుకుంటుందని, అప్పుడు పెరిగిన ఇంధన ధరల ప్రభావం ప్రయాణికుల మీద పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.