సినిమా రివ్యూ: ‘కన్నప్ప’

- June 27, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కన్నప్ప’

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమానే ‘కన్నప్ప’. వివిధ భాషల నుంచి పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించడంతో ఇదో భారీ చిత్రంగా పరిగణించాలి. కాస్టింగ్ పరంగానే కాదు, బడ్జెట్ పరంగానూ ఈ సినిమాని భారీ చిత్రంగా రూపొందించారు. మోహన్ బాబు సొంత బ్యానర్‌లో మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా ఈ సినిమాని రూపొందించారు. సీనియర్ నటులు కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సినిమా. ఆ సినిమా రిఫరెన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ జనరేషన్‌‌కి విజయవంతంగా నిలిచిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు చిన్నతనంలో ఆ గూడెం ఆచారానికి తగ్గట్లుగా అమ్మవారికిచ్చే బలిని చూసి నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడు.. అది ఒట్టి రాయి మాత్రమే అని నమ్ముతాడు. ఒకానొక సందర్భంలో తన నాస్థికత్వానికి గూడెం నుంచి వెలివేయబడతాడు. అదే సమయంలో తనను ప్రాణ ప్రదంగా ప్రేమించిన నెమలి (ప్రీతి ముకుందన్) తిన్నడి వెంట నడుస్తుంది. అలా నెమలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తిన్నడు తాను పుట్టి పెరిగిన గూడెంని వదిలి దూరంగా వెళ్లిపోయి సంసారం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే రుద్ర (ప్రబాస్) తారసడతాడు తిన్నడికి. రుద్ర ప్రభావంతో మెల్ల మెల్లగా పరమ శివుడికి తిరుగు లేని భక్తుడవుతాడు తిన్నడు. అసలు రుద్ర ఎవరు.? మరోవైపు తానే దైవం, శైవం అంటూ వాయు లింగాన్ని సాధారణ భక్తులకు కనిపించకుండా చేస్తాడు మహా దేవ శాస్త్రి (మోహన్ బాబు).కిరాతా (మోహన్ లాల్) ఎవరు.? నాస్థికుడిగా వున్న తిన్నడు కన్నప్పగా మహా శివ భక్తుడిగా మారిపోయి శివుడి కోసం ఏం త్యాగం చేశాడు.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ‘కన్నప్ప’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీనటుల పనితీరు:
మంచు విష్ణుకి ఈ తరహా పాత్ర ఇదే తొలిసారి. కానీ, తన వరకూ తిన్నడి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పతాక సన్నివేశాల్లో విష్ణు సర్‌ప్రైజింగ్ పర్‌ఫామెన్స్ అందించాడు. ఈ సినిమా నిజంగానే మంచు విష్ణు కెరీర్‌లో ఓ మైలురాయిగానే చెప్పుకొవచ్చు. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ తనదైన అంద చందాలతో ఆకట్టుకుంది. అలాగే అభినయంతోనూ మెప్పించింది. మోహన్‌లాల్ కిరాతగా చిన్న పాత్రలోనే కనిపించినప్పటికీ, ఆ పాత్ర ప్రభావం సినిమా చివరి వరకూ వుంటుంది. ఆయనొచ్చాకే సినిమాకి ఊపొస్తుంది. ఇక ఆ తర్వాత రుద్రగా ప్రబాస్ పాత్ర ఎంటర్ అయ్యాకా సినిమాకి అసలు సిసలు ఊపొచ్చిందని చెప్పొచ్చు. విష్నుకీ, ప్రబాస్‌కీ మధ్య సంభాషణలు ఆకట్టుకుంటాయ్. ‘మీకు పెళ్లయ్యిందా.?’ అని తిన్నడు, రుద్రని అడిగిన ప్రశ్నకీ ధియేటర్లలో విజిల్స్ మోత మోగిపోయాయ్. పార్వతీ పరమేశ్వరులుగా అక్షయ్ కుమార్, కాజల్ తమకున్న స్పేస్‌లో మంచి నటన కనబరిచారు. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు తన వయసుకు తగ్గ పాత్రలో నటించి తనదైన అనుభవాన్ని రంగరించి చూపించారు. తిన్నడి తండ్రి నాథ నాధుడి పాత్రలో శరత్ కుమార్ చక్కగా సరిపోయారు. ముఖేష్ రుషి, మధు బాల, బ్రహ్మానందం సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. అన్నట్లు తిన్నడి చిన్నప్పటి పాత్రలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్, శ్రీ కాళహస్తి చరిత్రను చెప్పే పాటలో వివియానా, అరియానా, చిత్ర సర్‌ప్రైజింగ్ రోల్స్‌లో కనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
బుల్లితెరపై పురాణ కథల్ని ఆవిష్కరించిన అనుభవం, పెద్ద తెరపై ఈ భక్త కన్నప్ప చరిత్రను ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా మలచడంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ విజయం సాధించాడనే చెప్పాలి. పౌరాణిక గాధ అయినప్పటికీ ఈ జనరేషన్ ప్రేక్షకులకి అర్ధమయ్యేలా డైలాగ్స్ చెప్పించడం మెచ్చుకోదగ్గ అంశం. ఈ సినిమాకి మరో హైలైట్ లొకేషన్లు. న్యూజిలాండ్‌లోని లొకేషన్లను అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా చక్కగా సెట్ చేశారు. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్. ‘శివా శివా..’సాంగ్ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్లుగా వుంది. ఎడిటింగ్ పరంగా.. ఫస్టాఫ్‌లో నిడివిపై కాస్త ఫోకస్ పెట్టి వుంటే బాగుండేది. రెగ్యులర్ లవ్ సీన్లు కాస్త ఎబ్బెుట్లుగా అనిపిస్తాయ్. దాదాపు 15 నిమిషాల ఆయా సన్నివేశాలు కట్ చేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపించాయ్. నిర్మాణం పరంగా ఏమాత్రం రాజీ పడలేదు. ఆ ఎఫర్ట్ అంతా తెరపై బాగా కనిపించింది.

ప్లస్ పాయింట్స్:
మంచు విష్ణు నటన, పతాక సన్నివేశాలు, ప్రబాస్ ఎపిసోడ్, లొకేషన్లు మొదలైనవి.

మైనస్ పాయింట్స్:
ఫస్టాప్‌లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు, అవసరముండీ సరిగ్గా వాడని కొన్ని యాక్షన్ సన్నివేశాలు..

చివరిగా:
‘కన్నప్ప’ ఈ జనరేషన్ ఆడియన్స్‌కి ఓ సరికొత్త అనుభూతే.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com