లిక్కర్ కింగ్ మేకర్-ఆదికేశవులు నాయుడు
- July 01, 2025
ఆదికేశవులు నాయుడు...దక్షిణాదిన లిక్కర్ కింగ్ పిన్ వ్యాపారవేత్తగా ప్రసిద్ధుడైన రాజకీయ నాయకుడు. చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన ఆదికేశవులు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో లిక్కర్ వ్యాపారానికి ఆయువుపట్టుగా నిలిచారు.లిక్కర్ నుంచి వివిధ రంగాలకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత రాజకీయాల్లో కూడా రాణించారు. తితిదే ఛైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. నేడు ప్రముఖ వ్యాపారవేత్త డీకే ఆదికేశవులు నాయుడు జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
డీకే ఆదికేశవులు నాయుడు పూర్తిపేరు దళవాయి కృష్ణస్వామి ఆదికేశవులు నాయుడు. 1941, జూలై 1న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త చిత్తూరు జిల్లా సత్యవేడు తాలూకాలోని దళవాయి అగ్రహారం గ్రామంలో దళవాయి కృష్ణస్వామి, రుక్మిణమ్మ దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించారు. ఆదికేశవులు కర్ణాటకలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తొలుత చిత్తూరు సహకార షుగర్ ఫ్యాక్టరీలో ఇంజనీరుగా పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకుడిగా పనిచేశారు.
ఆదికేశవులు తండ్రి కృష్ణస్వామికి చిత్తూరుకు చెందిన రాజకీయ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ఎన్.పి. వీరరాఘవులు నాయుడు, చెంగల్రాయ నాయుడులతో సన్నిహిత సంబంధాలు. వారి సహాయ సహకారాలతో ఆయన చిత్తూరులో స్థిరపడ్డారు. చిత్తూరు సహకార షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడైన వీరరాఘవులు నాయుడు గారి సిపారస్సుతోనే ఇంజనీరింగ్ చదివిన ఆదికేశవులకు ఉద్యోగం లభించింది. తండ్రి నుంచి వారసత్వంగా సారాయి తయారీ వ్యాపారం ఉండేది. అయితే, ఆదికేశవులు ఆ వ్యాపారాన్ని చేసేందుకు తొలుత అంగీకరించలేదు. అయితే, వారి తండ్రి ఆకస్మిక మరణంతో తప్పక సారాయి తయారీ వ్యాపారంలోకి దిగారు.
సారాయి తయారీ వ్యాపారంలో ఉన్నప్పుడే దేశి అరకు కాంట్రాక్ల్స్ ను కాంగ్రెస్ నేతలైన ఎన్.పి కుటుంబం సహకారంతో ఆదికేశవులు గారు సాధించారు. సారాయి, అరకు వ్యాపారాల్లో వచ్చిన లాభాలతో లిక్కర్ డిస్టిలరీ వ్యాపారంలోకి దిగారు. తన మేధస్సు, కృషి మరియు వ్యాపార నిర్వహణ దీక్షా దక్షతలతో కొద్దీ సంవత్సరాల్లోనే చిత్తూరు మరియు సరిహద్దు తమిళనాడు జిల్లాల్లో సైతం డిస్టిలరీలను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో చిత్తూరుకు అనుకోని ఉండే కర్ణాటక రాష్ట్రంలో సైతం తన లిక్కర్ వ్యాపారాన్ని విస్తరించారు. 70వ దశకంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉంటూ కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా కోలార్, తుమకూరు, బళ్లారి ప్రాంతాల్లో లిక్కర్ డిస్టిలరీ యూనిట్స్ స్థాపించారు.
1980వ దశకం ప్రారంభానికి ఆదికేశవులు నాయుడు క్రమంగా లిక్కర్ వ్యాపారంలో ఎదుగుతూ వచ్చారు. 1983లో రామకృష్ణ హెగ్డే సీఎం అయిన దగ్గర నుంచి ఆ రాష్ట్రంలో ముఖ్యంగా మద్రాస్ - కర్ణాటక ప్రాంతంలో లిక్కర్ కాంట్రాక్ట్స్, డిస్టిలరీ లైసెన్సులు సాధించి, ఆ ప్రాంతంలో లిక్కర్ వ్యాపారం మీద ఆధిపత్యాన్ని సాధించారు. శ్రీనివాస డిస్టిలరీస్ సంస్థ ద్వారా హెగ్డే ఉన్నంత కాలం తన వ్యాపారానికి తిరుగులేకుండా చేసుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా హెగ్డేకు మరియు ఆయన మంత్రివర్గ సహచరులకు కోట్లలో ముడుపులు సమర్పించుకున్నారు. ఈ సమయంలోనే యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. మాల్యా సహకారంతో కర్ణాటక బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని డిస్టిలరీలను కైవసం చేసుకున్నారు.
మాల్యాతో పరిచయం వల్ల వ్యాపార విస్తరణ జరిగినప్పటికి, హెగ్డే ఇచ్చే దానికంటే అధికంగా ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడం ఎక్కువ అవ్వడంతో మాల్యాతో కలిసి హెగ్డే ప్రభుత్వాన్ని పడగొట్టడంతో కీలకమైన పాత్ర పోషించారు. మాల్యా ద్వారా దివంగత మాజీ ఎంపీ మరియు బాలాజీ డిస్టిలరీ అధినేత మాగుంట సుబ్బరామరెడ్డి సైతం వీరితో కలవడం ద్వారా దక్షిణాది లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం వీరే కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సుబ్బరామరెడ్డి తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఆదికేశవులు కర్ణాటక, మాల్యా కోస్టల్ కర్ణాటక, కొంకణ్ ప్రాంతం మరియు కేరళ రాష్ట్రాల్లో అత్యధిక డిస్టిలరీలను స్థాపించారు.
హెగ్డే తర్వాత వచ్చిన బొమ్మై కూడా అదే తీరున ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా నిలవడం మొదలుపెట్టారు.1990లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక, అంగ బలాలను సమకూర్చారు. వీరేంద్ర పాటిల్, బంగారప్పలు సీఎంగా ఉన్నప్పుడు వారి సహకారంతో మాల్యాతో కలిసి సిండికేటుగా ఏర్పడి కర్ణాటక లిక్కర్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకున్నారు. వీరప్ప మెయిలీ హయాంలో కొంత ఇబ్బందికర పరిమాణాలు ఎదుర్కొన్నారు.1994లో దేవెగౌడ సీఎం అవ్వడం మాల్యా - ఆదికేశవుల హవాను మరింత పెంచింది. గౌడతో మాల్యాకు ఉన్న పరిచయాలు కారణంగా వారి వ్యాపారాలకు ఎటువంటి డోకా లేదు. గౌడ 1996లో ప్రధాన మంత్రి అవ్వడంతో మాల్యాకు దేశవ్యాప్తంగా ఉన్న తమ డిస్టిలరీలకు అదనంగా మరికొన్నిటి ఏర్పాటుకు అనుమతి పొందారు.
మాల్యా ఆల్ ఇండియా స్థాయిలో వ్యాపారాలను చూసుకుంటూ ఉంటే, ఆదికేశవులు కర్ణాటకలో వ్యాపారాన్ని చూసుకునేవారు. దేవేగౌడ తర్వాత సీఎం అయిన జె.హెచ్.పటేల్ హయాంలో కూడా తమ వీరి గుత్తాధిపత్యం సాగింది. ఒకవైపు లిక్కర్ వ్యాపారం చేస్తూనే వివిధ రంగాలకు వ్యాపారాలను విస్తరించారు. చిత్తూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో షుగర్ ఫ్యాక్టరీస్ స్థాపించారు. ఆ తర్వాత వైదేహి గ్రూప్ కింద బెంగళూరు కేంద్రంగా మెడిసిన్, నర్సింగ్, లా, డిగ్రీ కాలేజీలను స్థాపించారు. అలాగే, చిత్తూరు జిల్లాలో శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీని స్థాపించారు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, సినిమా హాల్స్, రవాణా రంగాల్లోకి విస్తరించారు. బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రాంతంలో కొన్ని వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
మద్యం వ్యాపారంలో ఉంటూనే రాజకీయాల్లో అడుగుపెట్టారు ఆదికేశవులు నాయుడు. 80వ దశకం చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సుబ్బరామరెడ్డి ద్వారా అప్పటి సిఎం నేదురుమల్లి జనార్దన రెడ్డికి దగ్గరయ్యారు. తిరుపతి కాంగ్రెస్ సమావేశాల్లో సైతం కీలకంగా వ్యవహరించారు. పివి ప్రధాని అయిన దగ్గర నుంచి ఆయన ప్రాపకం పొందేందుకు ఎంతో చేతి సామురును వదిలించుకున్నారు. 1992లో పివి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి పదవిని పొందారు. 1996లో చిత్తూరు లోక్ సభ టిక్కెట్ ఆశించినా, కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబుకు దగ్గరవుతూ వచ్చారు. చంద్రబాబు మానస పుత్రికగా భావించే జన్మభూమి కార్యక్రమంలో సామాజిక సేవా దృక్పథం కింద చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి, మంచినీటి పథకం నిర్మాణం కోసం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. జన్మభూమిలో ఆదికేశవులు ఖర్చు చేసిన దానికి రెట్టింపైన విలువ గల లిక్కర్ కాంట్రాక్ట్స్ బాబు మంజూరు చేశారని చెబుతారు. అలా చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యాన్ని పెంచుకున్న తర్వాత 1999లో బాబు సమక్షంలో తెదేపాలో చేరి చిత్తూరు ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికి సిట్టింగ్ ఎంపీ నూతనకాల్వ రామకృష్ణారెడ్డిని కాదని సిటు ఇవ్వలేకపోయారు. ఆ ఎన్నికల్లో సీటుకు బదులు చిత్తూరు సహకార షుగర్ ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలను తక్కువధరకే ఇప్పించారు. 1999లో తితిదే బోర్డు ఛైర్మన్ పదవిని సైతం కట్టబెట్టారు. 1999- 02 వరకు తితిదే బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించారు. బాబు నుంచి పొందిన ఫలాలకు అనుగుణంగానే ఆదికేశవులు తెదేపాకు విరాళాల రూపంలో బాగానే ఖర్చు పెట్టారు.
2004 ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి వయోభారం కారణంగా పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఆదికేశవులు నాయుడుకు చిత్తూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో ఎన్డీయే ఓటమి వల్ల ఆదికేశవులకు ఎంపీ పదవి అక్కరకు రాకుండా పోయింది. ఇదే సమయంలో రాయలసీమ బలిజ కులస్థులను ఏకీకరణ కోసం కృషి చేస్తూ, బలిజ ఐక్యవేదిక సంఘం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చారు. తెదేపాలో గెలవడం వల్ల ప్రయోజనం చేకూరక పోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి పునః ప్రవేశం చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో 2008 ఇండియా - అమెరికా అణు ఒప్పందం బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఈ చర్యతో ఆదికేశవులను తెదేపా సస్పెండ్ చేసింది. తెదేపా నుంచి సస్పెండ్ అయిన కొద్దీ రోజులకు అప్పటి సీఎం వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దీ రోజులకే 2009 ప్రారంభంలో రెండో పర్యాయం తితిదే బోర్డు ఛైర్మన్ అయ్యారు. 2009లో చిత్తూరు రిజర్వు స్థానంగా మారడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2009-11 వరకు తితిదే బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఉచితంగా మినరల్ వాటర్ కేంద్రాలను ఏర్పాటు చేసి "నీటిధార" మంచినీటి సరఫరా పథకానికి శ్రీకారం చుట్టారు. అలాగే, ఆలయానికి బంగారు తాపడం చేసే కార్యక్రమం సైతం ఆయన హయాంలోనే మొదలైంది. ఈ కార్యక్రమం కోసం తితిదే నిధులతో పాటుగా తన సొంత నిధులను కూడా వెచ్చించారు. ఆ పదవిలో ఉన్న రెండేళ్ళలో పలు వివాదాలు చుట్టుముట్టినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పలు సౌకర్యాలను ఏర్పాటు చేయించారు. తితిదే చైర్మన్ పదవి నుంచి దిగిపోయిన తరువాత రాజ్యసభ ఎంపీగా వెళ్ళాలని అనుకున్నా అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు.
వ్యాపారాలు, రాజకీయాలతో పాటుగా పలు సామాజిక సేవా కార్యకమాలు నిర్వహించారు. వైదేహి ట్రస్ట్, శ్రీవాసా ట్రస్ట్ ల ద్వారా ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తమ సంస్థల్లో పనిచేసే వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం మరియు తమ విద్యాసంస్థల్లో తక్కువ ఫీజులతో చేర్చుకునేవారు. అలాగే, సత్యసాయి బాబా ఆరాధకుడైన ఈయన పుట్టపర్తి నీటి సరఫరా పథకం నిర్మాణానికి భారీగా నిధులు సమకూర్చారు. బెంగళూరు వైట్ ఫీల్డ్ లో బాబా ఆశ్రమానికి కావాల్సిన భూమిని ఇవ్వడం మరియు ఆశ్రమ నిర్మాణం ఖర్చులు చాలా వరకు భరించారు. ఇవే కాకుండా చిత్తూరులో దాదాపు పలు గ్రామాలకు వేసవి కాలంలో ఉచితంగా మంచి నీటిని ట్యాంకర్లు ద్వారా సరఫరా చేయించేవారు. ఇంక దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు భూరి విరాళాలు ఇచ్చారు.
నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానంలో ఆదికేశవులు నాయుడు వ్యాపారాలు వందల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాయి. వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో అన్ని పార్టీల నాయకులతో, తన సహచర వ్యాపారవేత్తలతో, సామాజిక, ఆధ్యాత్మిక ప్రముఖులతో అత్యంత సన్నిహత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ, అందరికి తలలో నాలుకగా వ్యవహరిస్తూ తన పనులను చక్కబెట్టుకుంటూ వచ్చేవారు. ఆ వ్యవహార దక్షత, సహనం, ఓర్మి వల్లే సాధారణ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచారు. అనారోగ్యం కారణంగా 2013, ఏప్రిల్ 24న తన 72వ ఏట బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు