గోదావరి యటకారి-కృష్ణ భగవాన్
- July 02, 2025
వంశీ దర్శకత్వం వహించిన ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ మూవీలో కొండవలస నోటి నుండి పదే పదే వచ్చే డైలాగ్ ‘ఐతే ఓకే’! దీన్ని రాసింది నటుడు కృష్ణ భగవాన్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. నటుడిలో రచయిత ఉంటే…ఆ సంభాషణలు ఎంతగానో పండుతాయనడానికి ఉదాహరణ ఇదే! ఆ మూవీ సక్సెస్ లో కృష్ణ భగవాన్, కొండవలస మధ్య సాగే కామెడీ ట్రాక్ ప్రధాన భూమిక పోషించిందంటే అతిశయోక్తి లేదు. వంశీ ఇచ్చిన ఆఫర్ ను నటుడిగానే కాకుండా కామెడీ ట్రాక్ రైటర్ గానూ సద్వినియోగం చేసుకుని ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశారు కృష్ణభగవాన్. కొందరి వెటకారం… కారంలా ఉండదు! వెన్నపూసలా చల్లగానూ, చిద్విలాసం చిందించేలానూ ఉంటుంది. కృష్ణభగవాన్ దీ అంతే… ఇవాళ ఆ చిలిపి నవ్వుల కృష్ణుడి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
కృష్ణ భగవాన్ అసలు పేరు మీనవల్లి పాపారావు చౌదరి. 1965 జూలై 2న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెదపూడి తాలూకా కైకవోలు గ్రామానికి చెందిన మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించారు. ఆయనకు ముగ్గురు అన్నలు, ఒక అక్క. పెదపూడి, కాకినాడ తర్వాత హైదరాబాద్ చేరి డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండీ నాటకరంగంతో ఉన్న అనుబంధంతో, పెద్దన్న మంగరాజు ప్రోత్సాహంతో కృష్ణ భగవాన్ చెన్నయ్ చేరి నటుడిగా అదృష్టం పరీక్షించుకున్నారు.
యుక్తవయసులోనే మైమ్, మిమిక్రీ చేయడంలో అనుభవం ఉండటంతో జంధ్యాల దర్శకత్వం వహించిన ‘శ్రీవారి శోభనం’లో తొలిసారి తెరమీద అలా చటుక్కున మెరిశారు కూడా! కానీ చెన్నయ్ చేరిన తర్వాత ప్రాధాన్యమున్న పాత్ర అంటే వంశీ చిత్రం ‘మహర్షి’లోనే దక్కింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. భగ్న ప్రేమికుడిగా మరో కీలక పాత్ర చేసి ‘మహర్షి’ని ఇంటి పేరుగా మార్చుకున్నాడు రాఘవ. ఆ సినిమా షూటింగ్ సమయంలో భగవాన్‌లో మంచి రచయిత కూడా ఉన్నాడని గ్రహించిన దర్శకుడు వంశీ ‘ఏప్రిల్ 1 విడుదల’కు రచన కూడా అతనితోనే చేయించారు. మీనవల్లి పాపారావు చౌదరి పేరు కాస్తంత ఎబ్బెట్టుగా ఉందని దర్శకుడు వంశీనే ‘మహర్షి’ షూటింగ్ టైమ్ లో దానిని ‘కృష్ణ భగవాన్’ చేసేశారు! సినిమా సూపర్ హిట్ అయినా… భగవాన్‌కు నటుడిగా, రచయితగా బ్రేక్ రాలేదు. ఖాళీగా ఉండకుండా ఆ సమయంలోనే యూ. నారాయణరావు దర్శకత్వం వహించిన ‘వసంత కోకిల’ సీరియల్ లో నటించి, రచన చేసి నంది అవార్డును అందుకున్నారు.
ఆన్ అండ్ ఆఫ్‌గా సాగుతున్న సినిమా ప్రయాణంలో బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’. ఆ తర్వాత కృష్ణ భగవాన్ నట ప్రస్థానం సాఫీగా సాగిపోయింది. ఆయనలోని వెటకారాన్ని గుర్తించిన దర్శక నిర్మాతలు కామెడీ ట్రాక్స్ తయారు చేసుకునే బాధ్యత ఆయనకే ఇచ్చారు. దాంతో కృష్ణ భగవాన్ రెచ్చిపోయారు. వెటకారంతో వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించారు. దానికి చిన్నప్పుడు తాగిన గోదారి నీళ్ళు కూడా ఓ కారణమే అంటారు.
మూడు క్యారెక్టర్స్, ఆరు కామెడీ పాత్రలతో సాగిపోతున్న కృష్ణ భగవాన్ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్’, ‘కుబేరులు’ చిత్రాలలో హీరోతో పాటు ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. ఇక ‘జాన్ అప్పారావు 40 ప్లస్’, ‘మిస్టర్ గిరీశం’ చిత్రాలలో హీరోగానూ నటించారు. అయితే… వెటకారంతో జనాలను ఆకట్టుకున్న కృష్ణ భగవాన్ హీరోగా మాత్రం మెప్పించలేకపోయారు. దాంతో తిరిగి తన కామెడీ పాత్రల్లోకి మళ్ళీ వచ్చేశారు.
కృష్ణ భగవాన్ తనకు తానుగా రిటైర్ మెంట్ తీసుకోవాలే కానీ ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికీ ఆయన్ని వదులుకోదు అంటారు తోటి ఆర్టిస్టులు. ఆ మధ్య కాస్తంత అనారోగ్యంతో నడక తగ్గి వేషాలు మందగించాయి కానీ కృష్ణ భగవాన్ లో యాక్టింగ్ కెపాసిటీకి ఢోకా లేదు. ఇప్పటికీ కృష్ణ భగవాన్ కొన్ని సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. అన్నట్టు ఈ మధ్యలో ఈయనకు భక్తి భావం కూడా బాగానే పెరిగింది. రమణమహర్షి, వివేకానంద, షిర్డీ సాయిబాబా గురించిన గ్రంధాల పఠనంలో మునిగిపోతున్నారు. త్వరలోనే ఏదో ఒక సినిమాలో ఆయన మార్క్ హాస్యాన్ని పండించడం ఖాయం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!