మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం..
- July 05, 2025
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు మళ్లీ కలుసుకున్నారు. దాదాపుగా 20ఏళ్ల తర్వాత ఇద్దరు నేతలు ఒకే వేదిక పై కలుసుకున్నారు. మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో అది ప్రతిపక్షాల విజయంగా పేర్కొంటూ ముంబై వేదికగా వాయిస్ ఆఫ్ మరాఠా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక తమను ఒక చోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, చివరికి బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా తమను కలిపారని రాజ్ ఠాక్రే అన్నారు. అనుకోకుండానే ఆయన తమను ఒకే వేదికపైకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఇకపై రాష్ట్ర ఐక్యత విషయంలో తాము ఎప్పటికీ ఒక్కటిగా ఉంటామని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాజ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం ద్వారా తమ పిల్లలు సరైన విషయాలు నేర్చుకునే అవకాశం లేకుండా పోతుందంటూ మోదీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ మండిపడ్డారు. దక్షిణ భారత దేశంలో ఎందరో సినీ నటులు, రాజకీయ నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ తమ మాతృ భాషలైన తెలుగు, తమిళం వంటి భాషల విషయంలో ఎంతో గర్వంగా ఉంటారని అన్నారు. అలాగే మహారాష్ట్ర నేతలకు, ప్రజలకు కూడా తమ భాషపై అభిమానం ఉంటుందని రాజ్ ఠాక్రే అన్నారు.
తమకు హిందీ భాషపై వ్యతిరేకత ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. అయితే ఇతరులపై ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పూర్వీకులు మరాఠా సామ్రాజ్యాన్ని ఎన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ఎప్పుడూ అక్కడి వారిపై మరాఠీని బలవంతంగా రుద్ద లేదని రాజ్ ఠాక్రే వెల్లడించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలపై త్రిభాషా సూత్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఇప్పటికీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇతర హైకోర్టుల్లో అన్ని ఉత్తర్వులు ఆంగ్ల భాషలోనే ఉన్నాయని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానాన్ని మహారాష్ట్రపై రుద్దాలని చూస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







