నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత

- July 06, 2025 , by Maagulf
నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత

ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను సొంతం చేసుకున్న నొవాక్ జకోవిచ్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.అతను వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ చరిత్రలో 100 విజయాలు సాధించిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ఇది ఒక గొప్ప క్రీడా ఘనత మాత్రమే కాకుండా, స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం.మూడో రౌండ్‌లో తన స్వదేశీయుడైన సెర్బియా ఆటగాడు మియోమిర్ కెమనోవిచ్‌ పై 6-3, 6-0, 6-4 తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకున్నాడు. నొవాక్ జకోవిచ్ కంటే ముందు మార్టినా నవ్రతిలోవా, రోజర్ ఫెదరర్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.నొవాక్ జకోవిచ్ తన 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో ఏడింటిని ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో గెలుచుకున్నాడు. శనివారం కెమనోవిచ్‌పై సెంటర్ కోర్టులో తొలి సెట్‌లో 3-3 స్కోరు నుంచి వరుసగా 9 గేమ్స్ గెలిచి సునాయాసంగా తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు.నాకు ఇష్టమైన టోర్నమెంట్‌ లో నేను ఏ చరిత్ర సృష్టించినా దాని పట్ల నేను కృతజ్ఞుడను” అని నొవాక్ జకోవిచ్ కోర్టులో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

టైటిళ్లను సమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు
38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ తన 20వ వింబుల్డన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. తదుపరి మ్యాచ్ 11వ సీడ్ అలెక్స్ డి మినార్‪తో ఉంటుంది. మహిళల విభాగంలో 9 సార్లు వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియన్ మార్టినా నవ్రతిలోవా 120 సింగిల్స్ గెలుపొందగా పురుషుల విభాగంలో 8 సార్లు ఛాంపియన్ రోజర్ ఫెదరర్ 105 సింగిల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించాడు.తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 428 వారాలుగా పీఐఎఫ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌ లో నంబర్ వన్ స్థానంలో ఉన్న నొవాక్ జకోవిట్, ఇప్పుడు తన 8వ వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి రోజర్ ఫెదరర్ రికార్డు టైటిళ్లను సమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ఈ ట్రోఫీని గెలిస్తే ఓపెన్ ఎరాలో పురుషుల ‘మేజర్’ సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన అతి పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు.

జానిక్ సిన్నర్
గత నెల రోలాండ్ గారోలో నొవాక్ జకోవిచ్ క్లే-కోర్టులోతన 100వ మ్యాచ్ విజయాన్ని సాధించాడు. బెల్గ్రేడ్‌కు చెందిన నొవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్ మాత్రమే రెండు వేర్వేరు స్లామ్‌లలో 100 మ్యాచ్‌లు గెలిచిన పురుష ఆటగాళ్లుగా నిలిచారు.రోలాండ్ గారోలో జానిక్ సిన్నర్ చేతిలో సెమీ-ఫైనల్‌లో ఓడిపోయే ముందు నొవాక్ జకోవిచ్ తన 101వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 100 విజయాలకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్‌కు రికార్డు స్థాయిలో 10 ట్రోఫీలు ఉన్నాయి. యూఎస్ ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్ 90 మ్యాచ్‌లతో 4 టైటిళ్లను గెలుచుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com