కళా వల్లభుడు-భరణి
- July 14, 2025
“మంచి అభిరుచి, మంచి హృదయం, మంచి భావం, మంచి భాష కలబోస్తే భరణి కనిపిస్తాడు”.. ప్రముఖ కార్టూనిస్ట్ తనికెళ్ల భరణి గురించి చెప్పిన మాటలివి. అవును ఇవన్నీ భరణిని చూడగానే మనకి తెలుస్తాయి. అతను దర్శకత్వం వహించిన “మిథునం” సినిమాలో అయితే కనిపిస్తాయి. వీధి నాటకాల ద్వారా కవిగా, నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన సినిమాల్లోనూ సత్తా చాటారు. స్క్రీన్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా నవ్విస్తూనే.. నటనతో మెప్పిస్తున్నారు. నేడు విలక్షణమైన నటుడు తనికెళ్ల భరణి పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మీకోసం....
తనికెళ్ల భరిణి 1956 జూలై 14న సికిందరాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు తనికెళ్ళ రామలింగేశ్వరరావు, లక్ష్మీ నరసమ్మలు. వీరి తండ్రి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర ఎండగండి ప్రాంతం. అయితే పని నిమిత్తం 1938లో హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దైవభక్తి, దేశభక్తితో పాటు సేవాగుణం ఎక్కువ. మహాభారతం, భాగతవతాలను ఔపోసన పట్టారు. యోగాసనాల్లో సైతం నిపుణులు. విశిష్ట సాహితీవేత్త. తనికెళ్ల భరణికి ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళున్నారు.
సికిందరాబాద్ రైల్వే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేయగా, జూనియర్ కాలేజీల్లో బీ.కామ్. కామర్స్ చదివారు. చిన్ననాటి నుంచి నాటకాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. 1970లలో నాటకాలు ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రముఖ నటుడు రాళ్ళపల్లితో పరిచయం ఏర్పడింది.ఆయన ప్రోత్సాహంతోనే చిన్న చిన్న సంభాషణలు, సన్నివేశాలు రాయడం మొదలు పెట్టారు.
భరిణి డిగ్రీ చదివే రోజుల్లో మిత్రుడు రాళ్ళపల్లి రాసిన “ముగింపు లేని కథ” నాటకంలో నటించారు. అతని నటనకు చప్పట్లు కురియడంతో వాటికి బానిస అయిపోయారు. డబ్బుల కోసం కంటే అభినందనల కోసమే నాటకాలు వేసేవారు. ఆ తర్వాత గార్ధభాండం, గోగ్రహణం, జంబూ ద్వీపం, కొక్కొరొకో, చల్ చల్ గుర్రం వంటి నాటకాలు రాయడమే కాదు .. నటించి ఆకట్టుకున్నారు. నాటకాల రచన ప్రతిభను మెచ్చి భరిణికి రామరాజు హనుమంతరావు ” కంచు కవచం ” అనే సినిమా రాసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత లేడీస్ టైలర్ చిత్రం తర్వాత రచయితగా బిజీ అయ్యారు. శివ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు.
కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్… ఈ సినిమాలో భరణిగారికి దొరబాబు అనే పాత్రలో నటుడిగా చేసే అవకాశం ఇచ్చారు వంశీగారు. అత్యంత పేరు తెచ్చిన సినిమా ‘శివ’. ఈ సినిమా దర్శకులు ఆర్జీవీ(రాంగోపాల్ వర్మ). తొలుత ఈ సినిమాకు డైలాగులు అందించే బాధ్యతను ఆర్జీవీ భరణిగారి మీద పెట్టారు. అప్పటికి వంశీగారితో చాలా సినిమాలు చేసిన ప్రభావం ఆయన మీద బాగా ఉండటంతో, ఆ సంబాషణలన్నీ కూడా కామెడీతో నింపేశారు. ఆ స్క్రిప్ట్ చదివిన ఆర్జీవీ గారు షాక్ అయ్యి, ‘ఇదేంటి కామెడీ సినిమా చేశారు. నాది సీరియస్ సినిమా, ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఉండటానికి వీల్లేదు’ అన్నారట. దీంతో స్క్రిప్ట్ మార్చి రాసి ఇచ్చారట. ఆ సినిమా ఫలితం అందరికి తెలిసిందే.
1994లో వచ్చిన యమలీల.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకులు… ఇందులో భరణిగారిది తోట రాముడు పాత్ర. ఈ పాత్ర వల్ల ఆయనకు జనాలలో మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమా తర్వాత దాదాపుగా 27 సినిమావకాశాలు ఆయన ముందుకు వచ్చాయి.‘మైనే తేరే ప్యార్ మే పాగల్’ అనే హిందీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు తనికెళ్ళ భరణి. చిత్రం, నువ్వు నేను, మన్మధుడు, ఒకరికొకరు, సాంబ, మల్లేశ్వరి… మొదలైన చిత్రాల్లో మంచి పేరు వచ్చింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ సినిమాలోని నాయుడు పాత్ర ఆయనని బాగా ఫేమస్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఆ తర్వాత చేసిన గోదావరి, జల్సా, బృందావనం, జులాయి వంటి సినిమాల్లో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఒక పక్క సినిమాల్లో నటన చేస్తూనే, మరోపక్క కథా సహకారం అందించడంలో ముఖ్యులుగా ఉన్నారు. అలా రచనా సహకారం అందించిన చిత్రాలు.. మనీ మనీ, యమలీల, ఘటోత్కచుడులు ప్రధానమైనవి. రైటర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
సాహితీ ప్రపంచంలోనూ అవిరళ కృషి జరుపుతున్న భరణిని ‘పుంభావ సరస్వతి’గా అభివర్ణిస్తారు. పరికిణీ, నక్షత్ర దర్శనం, మాత్రలు తదితర రచనలు చేశారు. ‘ఎందరో మహానుభావులు’ పేరిట అనేక వ్యాసాలు రాసి, పుస్తకంగా తీసుకోచ్చారు. తనికెళ్ల శివునికి పెద్ద భక్తులు. సినిమాల్లో బిజీగా ఉన్నా లంకేశ్వరునిపై రెండు పుస్తకాలు రాశారు. భరణి శివునకు అర్పించిన 108 కవితా మారేడుదళాల అష్టోత్తరం “ఆటగదరా శివా”. శివ తత్వాలతో శబ్బాష్ రా శంకరా .. అనే మరొక పుస్తకాన్ని రచించారు. అంతేకాదు నాలోన శివుడు గలడు, నీలోనే శివుడు గలడు అనే కీర్తనను స్వర పరిచారు.
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ విలువలు, మానవీయ విలువలకు భరణిగారు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. పుస్తక పఠనం, పచ్చటి ప్రకృతి, ఆవకాయ పచ్చడి ఆయనకి చాలా ఇష్టం… రైతుల కష్టాల పట్ల ఆయనకున్న బాధని ‘ది లాస్ట్ ఫార్మర్’ చిత్రం తెలియజెప్తుంది.
రచయితగా, నటుడిగా ఆకట్టుకున్న తనికెళ్ల భరిణి మెగా ఫోన్ పట్టి “మిథునం” తెరకెక్కించారు. అందరితో శబ్బాష్ రా భరిణి అనిపించుకున్నారు.రెండు పాత్రలతో (బాలసుబ్రమణ్యం, లక్ష్మి) సినిమాను పూర్తి చేసి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒకే రకం పాత్రలకు పరిమితం కాకుండా, విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!