కాంగ్రెస్ గేట్ కీపర్-ఆర్.కె. ధావన్
- July 16, 2025
ధావన్ ...ఈ పేరు ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించింది.నెహ్రూ-గాంధీల కుటుంబానికి నాలుగున్నర దశాబ్దాల పాటు వీర విధేయత ప్రకటిస్తూ వచ్చిన అత్యంత అరుదైన వ్యక్తి. ఇందిరా నుంచి సోనియా వరకు రాజకీయ మరియు ప్రభుత్వ వ్యవహారాల్లో కళ్ళు చెవులుగా వ్యవహరించారు. గాంధీ కుటుంబానికి చెందిన ఎన్నో నిగూఢమైన రహస్యాలను తెలిసిన ఏకైక వ్యక్తి. కాంగ్రెస్, గాంధీలకు కాపలాదారుగా తన జీవన పర్యంతం సేవలు చేశారు.పదవుల కంటే గాంధీల సహచర్యాన్నే ఎక్కువగా కోరుకున్నారు.నేడు కాంగ్రెస్ గేట్ కీపర్ ధావన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
ల్యూటెన్స్ ఢిల్లీ రాజకీయ, సామాజిక, మీడియా మరియు పారిశ్రామిక వర్గాల్లో ధావన్ సాబ్‌గా, ఆర్.కె.డిగా సుపరిచితులైన ఆర్.కె.ధావన్ పూర్తి పేరు రాజీoదర్ కుమార్ ధావన్ 1937, జూలై 16న అవిభక్త పంజాబ్ ప్రావిన్స్‌లోని చినియోట్ పట్టణంలో మధ్య తరగతి పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. తండ్రి మేళా రామ్ ధావన్ వ్యాపారం చేసేవారు. దేశ విభజన సమయంలో తమ స్వస్థలం పాకిస్తాన్‌లో కలవడం వల్ల అక్కడ స్వతంత్ర భారతావనికి శరణార్థిగా కుటుంబంతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత టైపింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు.
ధావన్ మేనమామ కొడుకైన యశ్‌పాల్ కపూర్ ఢిల్లీ విదేశాంగ శాఖ కార్యాలయంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. స్టెనోగ్రాఫర్‌గా చేరి అతి కొద్దీ కాలానికే, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సంబంధాలు ఏర్పరచుకొని రాజకీయంగా ఎదగడం మొదలుపెట్టారు. కపూర్ రాజకీయంగా కొంత పలుకుబడి సాధించిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ధావన్‌కు ప్రధాని నెహ్రూ అధికార నివాసంగా ఉన్న తీన్‌మూర్తి భవన్‌లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాన్ని ఇప్పించారు. 1957లో ఉద్యోగంలో చేరిన ధావన్ తీన్‌మూర్తి భవన్‌లో పనిచేస్తున్న సమయంలోనే నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీకి దగ్గరయ్యారు. ముఖ్యంగా, ఇందిరా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో కపూర్ ఆమె అధికారిక స్టెనోగా వ్యవహరించగా, ధావన్ ప్రవేట్ స్టెనోగా ఉండేవారు.
1960లో ఇందిరా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత కపూర్ కేంద్ర మంత్రులకు స్టెనో కమ్ పీఏగా మారారు. అయితే, ధావన్ మాత్రం తీన్‌మూర్తి భవన్‌లో ఉంటూ ఇందిరా స్టెనోగా కొనసాగారు. నెహ్రూ మూడోసారి ప్రధాని అయిన తర్వాత నుంచి అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతూ ఇందిరా మీద ఆధారపడటం మొదలుపెట్టారు. నెహ్రూ సంరక్షకురాలిగా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నప్పటికి నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న మత్తాయ్ రాజీనామా తర్వాత ఆ బాధ్యతలు ఇందిరా చేపట్టారు. 1962-64 మధ్యలో ఇందిరా ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షణ చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి ధావన్ ఆమెకు స్టెనోగానే కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా మారారు.
1964లో నెహ్రూ మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఇందిరా సమాచార శాఖ మంత్రిగా ఇందిరా బాధ్యతలు చేపట్టారు.ఇందిరా మంత్రి అయిన వెంటనే తన ఓఎస్డీగా ధావన్‌ను నియమించుకున్నారు. అప్పటి నుండి ఆమె చివరి వరకు ఆ బాధ్యతల్లోనే ధావన్ కొనసాగారు. 1966లో ఇందిరా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఎంవో వ్యవహారాల్లో ధావన్ క్రియాశీలకం అయ్యారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన తర్వాత ఇందిరా నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ (ఆర్) వ్యవహారాల్లో తనకు సహాయకుడిగా ధావన్‌ను నియమించుకుంది. అప్పటి నుంచి 1977 వరకు అధికార వర్గాల్లో, పార్టీ వర్గాల్లో ధావన్ చాలా ప్రభావశీలుడైన వ్యక్తిగా నిలిచారు.
ఇందిరా ఆదేశాలను పాటిస్తూనే, స్వయంగా రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి రిపోర్ట్స్ తయారు చేయించడం, నాయకుల మధ్య సమన్వయం,ముఖ్యమంత్రుల మార్పులు చేర్పులు, మంత్రివర్గాల్లో కొత్త వారికి చోటు కల్పించడం, పీసీసీ కార్యవర్గాల నియామకాలతో పాటుగా అధికారుల బదిలీలు, ప్రమోషన్స్ & డిమోషన్స్ ఇలా పలు వ్యవహారాలన్నీ ధావన్ చేతుల మీదగా సాగేవి. 1972 నాటికి ధావన్ పీఎంవోలో ఒక బలీయమైన నిర్ణయ శక్తిగా మారారు. 1973లో కాంగ్రెస్ వ్యవహారాల్లో ఆసక్తి చూపిస్తున్న సంజయ్ గాంధీకి రాజకీయ మార్గదర్సకుడిగా మారి ప్రభుత్వ మరియు పార్టీ వ్యవహారాల పట్ల అవగాహన కల్పించారు.
సంజయ్ పార్టీ మరియు ప్రభుత్వ వ్యవహారాల్లో క్రియాశీలకం అవుతున్న దశలోనే 1975లో సంజయ్ ఒత్తిడి మేరకు ఇందిరా దేశంలో ఎమెర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ నిర్ణయాన్ని అప్పటి రాష్ట్రపతికి చెప్పేందుకు ధావన్ స్వయంగా వెళ్లారని అప్పటి జర్నలిస్టులు పేర్కొంటారు. ధావన్ ఇందిరా నిర్ణయాన్ని చేరవేసిన కొద్దీ సమయానికే దేశంలో ఎమెర్జెన్సీ మొదలైంది. ఎమెర్జెన్సీ మొదలైన నాటి నుంచి ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ కంటే సంజయ్ గాంధీ ఎక్కువగా క్రియాశీలకం అయ్యారు.
సంజయ్‌కి తోడుగా ధావన్, కేంద్ర మంత్రులైన ఓం మెహతా, బన్సీ లాల్‌లు మద్దతుగా ఉండేవారు. మొదట్లో సంజయ్ నిర్ణయాలకు మద్దతు పలికిన ధావన్, క్రమంగా సంజయ్ రైటిస్ట్ విధానాలను హర్షించలేకపోయారు. సంజయ్‌కి ఎదురు చెప్పలేక ఇందిరా వద్దకు వెళ్లి అన్ని విషయాలను చెప్పి పాలనా వ్యవహారాల్లో సంజయ్ జోక్యాన్ని తగ్గించమని మొరపెట్టడంతో పరిస్థితి చేయి దాటి పోతుందని భావించిన ఇందిరా 1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసింది. 1977 ఎన్నికల్లొ ఓటమి తర్వాత ఇందిరా నియంతృత్వ పోకడలని పేర్కొంటూ పార్టీ సీనియర్ల నేతలు రాజీనామాలు చేసి జనతా పార్టీలో చేరడం, పార్టీని చీల్చడం మూలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిన సమయంలోనూ ఇందిరా పక్షాన గట్టిగా నిలబడ్డారు.
1977-79 మధ్యన ఇందిరాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని అప్పటి జనతా ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెచ్చినప్పటికి, ఎటువంటి నిజాలు బయటపెట్టలేదు, తప్పుడు సాక్ష్యం చెప్పలేదు. ధావన్ నుంచి సమాచారం రాబట్టలేక, అసహనంతో జైల్లో వేసింది అప్పటి మొరార్జీ దేశాయ్ సర్కార్. 1979లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఇందిరా పక్షాన ఉన్న నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని తిరిగి పునర్నిర్మించే ప్రక్రియను ఇందిరా మార్గదర్శనంలో ప్రారంభించారు. గతంలో తాను చేసిన తప్పులను మళ్ళీ జరగనీయకుండా సంజయ్ సైతం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు. సంజయ్, ధావన్ ఒక జట్టుగా ఉంటూ 1980 నాటికి పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకువచ్చారు. 1980 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ధావన్, సంజయ్ చేసిన కృషి వల్లే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇందిరా నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి సంజయ్ ఏ పదవి లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించడానికి తన వంతు సమాయత్తం అవ్వడం తరుణంలో విమాన ప్రమాదంలో మరణించడం ధావన్ రాజకీయ జీవితానికి తోలి దెబ్బ. సంజయ్ ఆకస్మిక మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సంజయ్ లాగా రాజీవ్ గాంధీకి ధావన్ దగ్గర కాలేకపోయారు. పైగా ఇందిరా సైతం రాజీవ్‌ను తన వారసుడిగా తయారు చేసే క్రమంలో ధావన్ ప్రాధాన్యతల విషయంలో పట్టించుకోవడం తగ్గింది. ఇదే సమయంలో ధావన్‌కు పోటీగా కాశ్మీర్ నాయకుడు ఫోత్తేదార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీ కావడం, రాజీవ్, ఇందిరాలు సైతం ఆయన్ని ప్రోత్సహించడం కారణంగా ధావన్ కొంత ఇబ్బంది పడ్డారు. అయితే, తనదైన శైలిలో ఎలాంటి గడ్డు పరిస్థితుల నుంచైనా బయటపడగల సామర్థ్యం ఉన్న ధావన్ తెలివిగా ఫోత్తేదార్‌తో సయోధ్య కుదుర్చుకొని తన స్థానానికి ఢోకా లేకుండా చేసుకున్నారు.
1984లో ఇందిరా హత్య గావింప బడటం ధావన్ రాజకీయ జీవితానికి అతిపెద్ద దెబ్బగా పరిణమించింది. ఇందిరా తర్వాత ప్రధాని అయిన రాజీవ్ ధావన్ పట్ల కఠినంగా వ్యవహరించడం, తన సన్నిహితులైన అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్ ప్రభుతుల వల్ల పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే కమలాపతి త్రిపాఠి, ప్రణబ్ ముఖర్జీ, ధావన్ వంటి పలువురు ముఖ్యులను రాజీవ్ దూరం పెట్టారు. సన్నిహితుల వల్ల తప్పుదారి పట్టి చేసిన కొన్ని పాలనాపరమైన తప్పుల కారణంగా రాజీవ్ భారీ రాజకీయ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. తన తప్పులు తెలుసుకొని 1989 నాటికి తానూ దూరం పెట్టిన ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసిన తర్వాత ధావన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత నుంచి రాజీవ్ - ధావన్ మధ్య సన్నిహిత సంబంధాలు బలపడ్డాయి. 1990లో రాజీవ్ ప్రోద్బలంతో ధావన్ తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1991 ఎన్నికల ప్రచారంలో రాజీవ్ హత్యకు గురైన తర్వాత నుంచి దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబాన్ని కనుమరుగు కానీయకుండా చూసే బాధ్యతను తన భుజాలపైకి వేసుకున్న ధావన్, సోనియాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరుతూ, గాంధీ కుటుంబ విధేయత నేతల ద్వారా విజ్ఞప్తులు చేయించారు. అయితే, సోనియా విముఖత చూపిన తర్వాత ఆమె అభిప్రాయానికి విలువనిస్తూ పార్టీ సీనియర్ నాయకుడైన పివిని పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా, ప్రధాని పీఠాన్ని అధిరోహించేలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే, ప్రధాని పదవిని చేపట్టిన దగ్గర నుంచి పివి గాంధీ కుటుంబానికి విలువనివ్వడం లేదని భావించి, పార్టీలోని సీనియర్ నేతలతో కలిసి ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
పదవి ఎక్కిన దగ్గర నుంచి పివి ఆలోచనల్లో మార్పులు రావడమే కాకుండా తన స్థానాన్ని పదిలం చేసుకోవడం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ధావన్‌ను తనవైపు తిప్పుకోవాలని భావించి 1995లో తన మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ (స్వతంత్ర హోదా) బాధ్యతలను అప్పగించారు. 1995-96 వరకు పివి వద్ద మంత్రిగా పనిచేసినప్పటికి, గాంధీ కుటుంబానికి మాత్రం దూరం కాలేదు. 1996లో పార్టీ ఓటమి తర్వాత పివి నాయకత్వంపై వచ్చిన తిరుగుబాటుకు ధావన్ మద్దతు ఉందని అంటారు. 1996 నుంచి 2004 వరకు ధావన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించినప్పటికి, తనతో పాటుగా మోతిలాల్ వోరా, అహ్మద్ పటేల్, ఫోత్తేదార్ మరియు విన్సెంట్ జార్జిలు సైతం క్రియాశీలకం అయ్యారు. వీరందరికి సీనియర్ అయిన ధావన్ మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మరియు పార్టీ కోసం నిధుల సమీకరణ, నాయకుల మధ్య సమన్వయం వ్యవహారాలను చూసుకునేవారు.
1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ధావన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడయ్యారు. సోనియా కూడా రాజీవ్ లాగే కొంత సందేహించినప్పటికి, తమ కుటుంబం కోసం తన జీవితాన్ని సమర్పించిన విధేయతకు తగ్గట్లే, పార్టీలో అధికారికంగా ధావన్ ప్రాధాన్యత పెంచుతూ వచ్చారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రావడానికి ప్రణబ్ ముఖర్జీ, గులాం నబి ఆజాద్ మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన్మోహన్ మంత్రివర్గంలో చేరమని ఆహ్వానించినా, సున్నితంగా తిరస్కరించారు. 2004లో బీహార్ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎన్నికై 2010 వరకు కొనసాగారు.
ధావన్ కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి మధ్య అనుబంధం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగింది. ముఖ్యంగా ఇందిరా గాంధీ హయాంలో 22 ఏళ్ళ పాటు ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ రాజకీయ వ్యవహారాల్లో ఆమె అప్పగించిన ప్రతి బాధ్యతను నిష్టగా పూర్తి చేసేవారు. ఇందిరా రాజకీయ విజయాల్లో, ఓటముల్లో ఆమె చెంతన ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో ధావన్ ముఖ్యమైన వారు. తన అధినాయకురాలు ఆదేశాలను అనుసరించి రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్పులు, చేర్పుల్లో కీలకంగా వ్యవహరించారు. ఆరోజుల్లో ధావన్ నుండి ఫోన్ వచ్చిందంటే వారికి పదవులు రాబోతున్నాయి స్పష్టమయ్యేది. ధావన్ రాజకీయ నాయకుల మీదనే కాకుండా అధికార వర్గాల మీద కూడా పెత్తనం చెలాయించేవారు. ఇందిరా ప్రభుత్వంలో తమ పనులు జరగాలంటే ధావన్ సాబ్ అనుగ్రహం ఉండాలని అప్పట్లో మీడియా వర్గాలు కోడై కుసేవి. అందువల్లనే ఆయన కోసం నాటి ఢిల్లీ వర్గాలు మరియు ముంబై పారిశ్రామికవేత్తలు సైతం క్యూలు కట్టేవారు.
2009లో తిరిగి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా క్రియాశీలకంగా పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే, ఆ ప్రభుత్వంలో వరస కట్టి బట్ట బయలు అయిన కుంభకోణాల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినడం వల్ల మన్మోహన్ సింగ్ జమానా పూర్తయింది, కాంగ్రెస్ కొత్త ముఖాన్ని తెరమీదకు తేవాలని సోనియాకు ధావన్ సూచించారు. అయితే, పార్టీ ఉన్న అనిశ్చితిలో తన సూచన మీద సోనియా పెద్దగా దృష్టి సారించకపోవడం మూలంగానే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని ధావన్ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు అంటారు.
కాంగ్రెస్ పార్టీ ఓడినా ధావన్ మాత్రం ప్రతి రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లి రోజువారీ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తూనే ఉండేవారు. అయితే 2018 ప్రారంభం నుంచి అనారోగ్యం కారణంగా పార్టీ వ్యవహారాలకు దూరం అయ్యారు. తీవ్ర అనారోగ్యం కారణంగా 2018, ఆగస్టు 6న తన 81వ ఏట ఢిల్లీలో ధావన్ కన్నుమూశారు. భారత దేశ రాజకీయ చరిత్రలో ఒక స్టెనోగ్రాఫర్ కేంద్ర ప్రభుత్వాన్ని శాసించడం అనేది ఒక్క ధావన్ విషయంలోనే సాధ్యమైంది. ధావన్ తర్వాత ఎంతో మంది ఎదగాలని ప్రయత్నించినా కుదరలేదు. ఎందుకంటే ధావన్ లాగా రాజకీయాల్లో రాణించాలంటే అది ఎప్పటికి కుదరని పని అని ఢిల్లీ వర్గాలు సైతం ఘంటా పథంగా చెబుతాయి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!