15,000 డాలర్లు కడితేనే అమెరికా వీసాలు!

- August 05, 2025 , by Maagulf
15,000 డాలర్లు కడితేనే అమెరికా వీసాలు!

అమెరికా: వలసదారుల పై కఠిన ఆంక్షలు అమలుచేస్తోన్న అమెరికా తాజాగా వీసా ఆశావహుల నెత్తిన మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైంది. బిజినెస్‌, టూరిస్ట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు పూచీకత్తు కింద 15వేల డాలర్ల వరకు బాండ్‌ చెల్లించాలని అగ్రరాజ్య విదేశాంగశాఖ ప్రతిపాదించింది. ఈమేరకు ఫెడరల్‌ రిజిస్ట్రీలో మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) నోటీసులు జారీ చేయనుంది.

బీ-1 (బిజినెస్‌), బీ-2 (టూరిస్ట్‌) వీసాలపై నిబంధన
12 నెలల పైలట్ ప్రోగ్రామ్‌ కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. బీ-1 (బిజినెస్‌), బీ-2 (టూరిస్ట్‌) వీసాలపై ఈ నిబంధన తీసుకురానున్నట్లు తెలిపింది.ఫెడరల్‌ రిజిస్ట్రీలో అధికారి నోటీసు పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీని ప్రకారం బిజినెస్‌, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5వేలు, 10వేలు, లేదా 15వేల సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని, గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా, వీసా గడువు ముగిశాక కూడా అగ్రరాజ్యంలోనే ఉన్నా ఎలాంటి రీఫండ్‌ చేయరు.

అయితే, ఈ బాండ్‌ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని వివరించింది. షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. 90 రోజుల బిజినెస్‌, పర్యాటక ప్రయాణాల కోసం తీసుకొచ్చిన వీసా వేవర్‌ ప్రోగ్రామ్‌లో ఉన్న దేశాలకు ఈ బాండ్‌ వర్తించబోదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 42 దేశాలు ఉండగా, అందులో మెజార్టీ ఐరోపా దేశాలు కాగా ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి.
కాగా, వీసా గడువు తీరినా కొంతమంది దేశం విడిచి వెళ్లట్లేదని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రంప్‌ యంత్రాంగం అంటుంది. గతంలో ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ తరహా పైలట్‌ ప్రాజెక్టును తీసుకొచ్చారు.

US వీసా ఎంతకాలం చెల్లుతుంది?
 భారతీయ పౌరులకు US వీసా యొక్క చెల్లుబాటు వీసా రకాన్ని బట్టి ఉంటుంది. టూరిస్ట్ (B-1/B-2) వీసాలు సాధారణంగా బహుళ ఎంట్రీలతో 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతాయి, ప్రతి సందర్శనకు ఆరు నెలల వరకు బస చేయడానికి అనుమతిస్తాయి.
B1 మరియు B2 వీసా అంటే ఏమిటి?
సందర్శకుల వీసాలు అనేవి వ్యాపారం కోసం (B-1 వీసా), పర్యాటకం కోసం (B-2 వీసా) లేదా రెండు ప్రయోజనాల కలయిక కోసం (B-1/B-2 వీసా) అమెరికాలోకి తాత్కాలికంగా ప్రవేశించాలనుకునే వ్యక్తులకు ఇచ్చే వలసేతర వీసాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com