ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీ ఎత్తున తెలంగాణ బియ్యం ఎగుమతి..

- August 07, 2025 , by Maagulf
ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీ ఎత్తున తెలంగాణ బియ్యం ఎగుమతి..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశవ్యాప్తంగా చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా వరి పంట ఉత్పత్తిలో తెలంగాణను ఇక వెనక్కి తిప్పడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతులకు నేరుగా మద్దతుగా నిలవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు.ఇప్పటికే తెలంగాణ బియ్యంకు, దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్నత స్థాయిలో ఉంది. మాన్ సూన్‌ ఆధారంగా కాకుండా సంవత్సరంలో రెండు, మూడు పంటలతో బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పండుతున్న బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ఒక గొప్ప మైలురాయి.తాజాగా ఫిలిప్పీన్స్ దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి,తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ భేటీలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయాలనే ఒప్పందం కుదిరింది.

ఇది ఇప్పటివరకు తెలంగాణ బియ్యం కోసం కుదిరిన అతిపెద్ద ఎగుమతి డీల్ కావడం గమనార్హం.ఇప్పటికే గత సంవత్సరాల్లో ఫిలిప్పీన్స్‌కు 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ పంపింది. అక్కడి మార్కెట్‌ నుంచి మంచి స్పందన లభించడంతో.. ఇప్పుడు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దీంతో పాటు మొక్కజొన్నకు కూడా మంచి ఆదరణ ఏర్పడింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మొక్కజొన్న ఎగుమతుల పై కూడా ఆసక్తి చూపింది. త్వరలోనే దీన్నిగురించి ప్రత్యేకమైన చర్చలు జరిపి మరో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సమాచారం.ఇలాంటి ఎగుమతులు కేవలం ఆర్థిక లాభాలకే కాకుండా, తెలంగాణ రైతులకు స్థిరమైన మార్కెట్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో తమ పంటలకు మంచి గిరాకీ ఉందని తెలిసినప్పుడు, రైతుల్లో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. రైతుల ఆదాయం పెరగడంతో పాటు రాష్ట్ర స్థాయి ఆదాయ వృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఈ సవత్సరం మరో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదిరిందని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో బుధవారం నాడు ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ శాఖ మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ భేటీలోఫిలిప్పీన్స్‌-తెలంగాణ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు.. అలానే రానున్న రోజులకి సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండించే తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌- 15048) రకం బియ్యానికి ఫిలిప్పీన్స్‌లో మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. అందుకు రాష్ట్రం నుంచి ఆ బియ్యం ఎగుమతుల పరిధిని పెంచేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

ఈ భేటీలో కేవలం బియ్యం ఎగుమతి గురించే కాకుండా.. తెలంగాణలో పండే మొక్కజొన్నపై కూడా ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఆసక్తి చూపించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు.ఈక్రమంలో ఫిలిప్పీన్స్‌కు బియ్యంతో పాటు మొక్కజొన్న ఎగుమతులు కూడా ప్రారంభమైతే.. ఆ దేశంతో తెలంగాణ వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్తో మాట్లాడుతూ.. తమ దేశానికి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉందని వెల్లడించారు.అందుకే భవిష్యత్తులో బియ్యం ఎగుమతిని మరింత పెంచేందుకు వీలుంటుందని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అలానే ఫిలిప్పీన్స్‌ మంత్రిని తెలంగాణ పర్యటనకు ఆహ్వానించామని.. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com