హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

- August 21, 2025 , by Maagulf
హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.గురువారం హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసి, 6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్లు వర్షం కురిసే అవకాశం​ ఉన్నట్లు చెప్పారు.నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హెచ్‌సీయూ వద్ద అత్యధికంగా 1.23 సెంటిమీటర్ల వర్షం పడింది.మరోవైపు, తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాలో వర్షాలు కురుస్తాయన్నారు.

అలాగే, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

మరోవైపు, కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నిన్న భారీ వర్షాల నుంచి ముంబై ఉపశమనం పొందింది.

ముంబైలో ఎక్కువ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరిచి సాధారణ షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ నడుస్తున్నాయి. లోకల్ రైళ్లు తిరిగి పునరుద్ధరించడంతో సాధారణ సేవలు అందుతున్నాయి.

కార్యాలయాలు బుధవారం తెరుచుకోగా, బ్యాంకులు, దుకాణాలు కూడా సాధారణంగా నడుస్తున్నాయి. అయితే, లోనావాలా మున్సిపల్ కౌన్సిల్ భారీ వర్షాల కారణంగా ఈ రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com