విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 6.30 లక్షలు వసూలు.
- July 18, 2016
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తా నంటూ 24 మంది నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని సంతోష్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 17 పాస్‌పోర్టులు, కారు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వి. శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ ఎం. శంకర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. సంతోష్‌నగర్ కలందర్నగర్కు చెందిన మహ్మద్ షకీల్ అహ్మద్ అలియాస్ అహ్మద్ వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. సులువుగా డబ్బు సంపాదించాలని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల నుంచి 50 వేలు వసూలు చేశాడు. వారి నుంచి పాస్‌పోర్టులు తీసుకొని సికింద్రాబాద్‌లో వైద్య పరీక్షలు కూడా చేయించాడు. కార్వాన్ మొఘల్‌నగర్‌కు చెందిన సయ్యద్ రవూఫ్‌కు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి పాస్‌పోర్టు, కొంత డబ్బు తీసుకున్నాడు. కాలయాపన చేస్తూ పొంతనలేని సమాధానం చెప్పడంతో ఈనెల 15వ తేదీన రవూఫ్ సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ సుధాకర్ మహ్మద్ షకీల్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 6.30 లక్షలు వసూలు చేసినట్టు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 17 పాస్‌పోర్టులు, మహీంద్ర లోగాన్ కారు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తామని... ఖైరతాబాద్: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకొని నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను సైఫాబాద్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వి.చిన్నారావు అలియాస్ విన్నారావు, సరూర్‌నగర్‌కు చెందిన గోపాల్ గతంలో హోంగార్డులుగా పనిచేసి సస్పెండ్ అయ్యారు. వీరికి నల్లగొండ జిల్లాకు చెందిన బాలరాజు అనే నకిలీ హోంగార్డు పరిచయమయ్యాడు. ముగ్గురూ కలిసి డీజీపీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తమ స్నేహితుడని నమ్మించి గుంటూరు, కడప, శ్రీకాకుళం, కర్నూలు తదితర ప్రాంతాల యువకుల నుంచి 50 నుంచి 90 వేల వరకు వసూలు చేశారు. పది మంది వద్ద 11 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బిచ్చిన వారు ఒత్తిడి తేవడంతో నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి జనవరిలో ఉద్యోగంలో చేరాలని చెప్పారు. వాటిని తీసుకొని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన అభ్యర్థులకు అవి నకిలీవని తెలియడంతో మోసపోయామని గ్రహించారు. కడపకు చెందిన శివకుమార్ సైఫాబాద్ పోలీసులకు ఈనెల 15న ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి చిన్నారావు, గోపాల్, బాలరాజును అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 90 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







