14 గంటల ఆలస్యానికి స్పైస్‌జెట్‌కు భారీ జరిమానా

- September 02, 2025 , by Maagulf
14 గంటల ఆలస్యానికి స్పైస్‌జెట్‌కు భారీ జరిమానా

ముంబై: ఒక బర్గర్, కొన్ని ఫ్రెంచ్‌ఫ్రైస్ ఇచ్చి చేతులు దులుపుకున్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. 14 గంటల ఆలస్యం తర్వాత తగిన సదుపాయాలు కల్పించకపోవడంతో, సంస్థ పై రూ.55,000 జరిమానా విధిస్తూ ముంబై సబర్బన్ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది.2024 జూలై 27న దుబాయ్ నుంచి ముంబైకి ప్రయాణించాల్సిన ఓ వ్యక్తి స్పైస్‌జెట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా విమానం 14 గంటలకు పైగా ఆలస్యమైంది. అంత సుదీర్ఘ నిరీక్షణలో సంస్థ ఒక బర్గర్, ఫ్రెంచ్‌ఫ్రైస్ మాత్రమే ఇచ్చిందని బాధితుడు ఆరోపించాడు. ఇది డీజీసీఏ నిబంధనలకు విరుద్ధం అని స్పష్టంచేస్తూ, ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 

స్పైస్‌జెట్ తరఫు న్యాయవాదులు, ఆలస్యానికి సాంకేతిక లోపమే కారణమని చెప్పారు. అలాంటి పరిస్థితులు తమ నియంత్రణలో లేవని, అందువల్ల పరిహారం వర్తించదని వాదించారు. కానీ ఫోరం ఈ వాదనను తిరస్కరించింది. సాంకేతిక లోపం ఉన్నా, ప్రయాణికులకు సరైన భోజనం, వసతి కల్పించడం సంస్థ కనీస బాధ్యత అని స్పష్టం చేసింది.ఫ్లైట్ లాగ్స్, కమ్యూనికేషన్ రికార్డులు సమర్పించి తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నిరూపించుకోవాల్సింది. కానీ స్పైస్‌జెట్ దానిలో విఫలమైంది. దీంతో సంస్థ వాదన బలహీనమైపోయిందని ఫోరం పేర్కొంది.

ఫోరం తీర్పు ప్రకారం, బాధితుడికి మానసిక వేదన, ఇతర ఖర్చుల కింద రూ.50,000 చెల్లించాలి. అదనంగా, కేసు విచారణ ఖర్చుల కోసం రూ.5,000 కూడా చెల్లించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది.ఈ తీర్పు తర్వాత ప్రయాణికులకు న్యాయం జరిగిందనే నమ్మకం పెరిగింది. ఆలస్యాలు తప్పవచ్చు, కానీ సరైన సదుపాయాలు కల్పించడం సంస్థల బాధ్యత అని ఫోరం స్పష్టంచేసింది.విమానయాన సంస్థలు ప్రయాణికుల హక్కులను చిన్నచూపు చూడకూడదని ఇది ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com