బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

- September 02, 2025 , by Maagulf
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్టీ ఎమ్మెల్సీ కవితపై సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది.ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా కవిత పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడడం, పార్టీపై విమర్శలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోందంటూ ఆమె చేసిన షాకింగ్ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని స్పష్టం చేస్తూ పార్టీ ఆమె పై ఈ కఠిన చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

కవిత బహిష్కరణకు ప్రధాన కారణాల్లో ఆమె ఇటీవల చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ముఖ్యమైనవి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కేటీఆర్, హరీష్‌రావు గట్టిగా తిప్పికొట్టారు. ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణల పర్వం పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో బయటపెట్టింది. ఈ పరిణామాలే చివరకు కవితను పార్టీ నుంచి బహిష్కరించడానికి దారితీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కవిత భవిష్యత్ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతాయనే దానిపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె సొంత పార్టీని స్థాపిస్తారా లేక మరో జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలో చేరుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com