టీమ్‌ఇండియా స్పాన్సర్‌ షిప్‌ కోసం బిడ్ల‌ను ఆహ్వానించిన బీసీసీఐ..

- September 02, 2025 , by Maagulf
టీమ్‌ఇండియా స్పాన్సర్‌ షిప్‌ కోసం బిడ్ల‌ను ఆహ్వానించిన బీసీసీఐ..

ముంబై: టీమ్ఇండియా స్పాన్స‌ర్ షిప్ నుంచి డ్రీమ్ 11 త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ఆమోదం పొంద‌డంతో డ్రీమ్ 11 ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో బీసీసీఐ (BCCI) కొత్త స్పాన్స‌ర్ కోసం వెతుకులాట ప్రారంభించింది.అందులో భాగంగా మంగ‌ళవారం భార‌త స్పాన్స‌ర్ షిప్ కోసం బిడ్డింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది.

కాగా..ఇందు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే కంపెనీల‌కు ప‌లు మార్గ‌ద‌ర్శకాల‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉల్లంఘించొద్ద‌ని తెలిపింది.

స్పాన్స‌ర్ షిప్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే కంపెనీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..

  • ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గాంబ్లింగ్‌తో ప్ర‌త్య‌క్షంగా గానీ, ప‌రోక్షంగా గానీ ఎలాంటి సంబంధం క‌లిగి ఉండ‌కూడ‌దు.
  • భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డూ కూడా ఇలాంటి సేవ‌లు అందించ‌కూడ‌దు.
  • బెట్టింగ్‌, బిడ్డింగ్ సంస్థ‌ల్లోనూ ఆయా కంపెనీల‌కు పెట్టుబ‌డులు కూడా ఉండ‌కూడ‌దు.
  • గేమింగే కాకుండా.. క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్ఛేంజ్‌, క్రిప్టో టోకెన్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో భాగ‌స్వామ్యం ఉండ‌కూడ‌దు.

అంతేకాదండోయ్‌..బిడ్డింగ్‌లో నిషేధిత బ్రాండ్ల‌కు సంబంధించిన కంపెనీలు పాల్గొన‌కుండా నిషేదం విధించింది.

ఇక బిడ్డింగ్‌లో పాల్గొనాల‌నుకునే కంపెనీల వార్షిక ట‌ర్నోవ‌ర్ క‌నిష్టంగా రూ.300 కోట్లు అయినా ఉండాల‌ని నిబంధ‌న‌ను విధించింది. ఇక కంపెనీలు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించేందుకు చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 16గా నిర్ణ‌యించింది. ఎటువంటి కారణం ఇవ్వకుండా ఏ విధంగానైనా ఏ దశలోనైనా బిడ్డింగ్‌ ప్రక్రియను రద్దు చేసే లేదా సవరించే హక్కు బోర్డుకు ఉంటుంద‌ని తెలిపింది.

సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్‌..
సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియాక‌ప్ 2025 ప్రారంభం కానుంది. టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబ‌ర్ 9న ఆడ‌నుంది. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. లీగ్ ద‌శ‌లో భార‌త్ సెప్టెంబ‌ర్ 19న ఒమ‌న్‌తో ఆడ‌నుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com