అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం

- September 02, 2025 , by Maagulf
అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనులను వేగవంతం చేసి, సమయానికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక యంత్రాంగం (స్పెషల్ పర్పస్ వెహికల్–ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది.అమరావతి ప్రతిష్టకు ప్రతీకలుగా నిలిచే ప్రాజెక్టులు ఎస్పీవీ కిందికి రానున్నాయి. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, ఐకానిక్ వంతెన, ఎన్టీఆర్ విగ్రహం, ఇన్నర్ రింగ్ రోడ్డు, కృష్ణా నది రివర్‌ఫ్రంట్ వంటి నిర్మాణాలు ఇప్పుడు ఈ ప్రత్యేక సంస్థ ఆధ్వర్యంలో ఉంటాయి. నిధుల సమీకరణ నుంచి నిర్వహణ వరకు మొత్తం బాధ్యత ఎస్పీవీకే అప్పగించబడింది.

స్పోర్ట్స్ సిటీ తరహాలో అమరావతిలో ఒక ప్రత్యేక హెల్త్ సిటీ ఏర్పాటుకానుంది. అందులో భాగంగా బయో డిజైన్ ప్రాజెక్ట్ ఎస్పీవీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్టులో అమెరికా, సింగపూర్ సహా ఏడు దేశాల నిపుణులు భాగస్వామ్యం చూపేందుకు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం.గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపింది. 53.68 కిలోమీటర్ల రహదారులు, ఫుట్‌పాత్‌లు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యతను కూడా నిర్మాణ సంస్థలకే అప్పగిస్తామని అధికారులు వివరించారు.

అమరావతిలోని ప్రతి నిర్మాణం ప్రజలను ఆకట్టుకునే అద్భుతంలా ఉండాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్కిటెక్చరల్ డిజైన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నగరం మొత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని ఆయన సూచించారు.ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ల కోసం పలు హోటల్ సంస్థలు ఆసక్తి చూపాయి. వీటికి భూములు కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. అయితే నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే రైతులతో చర్చించి స్నేహపూర్వకంగా భూసేకరణ జరపాలని ఆయన చెప్పారు.

కృష్ణా నదిపై నిర్మించబోయే ఐకానిక్ వంతెనపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నదిలోని ద్వీపాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. అమరావతి దేశానికి ఒక మోడల్ రాజధాని కావాలి” అని ఆయన అన్నారు.సీఆర్డీఏ కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో సిబ్బంది నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవసరమైతే డిప్యుటేషన్ లేదా ఆన్-డ్యూటీ విధానంలో నియామకాలు జరపాలని ఆయన తెలిపారు.“అమరావతి నగరం ఎటు చూసినా ఆకర్షణీయంగా ఉండాలి. నిర్మాణాలు కాలానికి తగ్గట్టే ఉండాలి అని సీఎం అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com