అజ్నబీ

- July 19, 2016 , by Maagulf

కిరీటాలు పడిపోతాయని 
పలకరించక తిరిగే దాపరికాలు ఎదురవుతుంటాయి 
పెట్టుడు మీసాలూడిపోతాయని 
నవ్వనైనా నవ్వని పెద్దరికాలు గుచ్చుతుంటాయి 
అనుకుంటావు కానీ ...
ఒక్కసారైనా ఉరమకపోయినా 
ఒక్కసారైనా మెరవకపోయినా 
కనీసం 
మాటలతో మాటల్లో అల్లుకు పోతుండాలి 
ముఖంతో ముఖాలను పెనవేసుకు పోతుండాలి  
నడిచేటప్పుడు చెప్పుల చప్పుడు 
ఎగిరేటప్పుడు రెక్కల చప్పుడు 
చేసే తీరాలి 
సఖ్యాన్ని 
లౌక్యాన్ని 
కప్పుకొని తిరగాలి 
ముసుగులో మూడు ముచ్చట్లైనా చెప్పాలి 
నలుగురిలో నాలుగు చప్పట్లైనా కొట్టాలి
పరకాయ ప్రవేశమే కాదు 
పరవస్తు ప్రవేశమూ తెలియాలి 
మరమనుషులు తిరుగుతుంటాయి 
వినిపించేంత స్పష్టంగా 
కనిపించేంత స్వచ్ఛంగా 
నువ్వు నీలా బతికేందుకైనా 
కనీసం 
వానితో  ఒక్కసారైనా  నటించే తీరాలి 
కొంచెమైనా తగ్గనిదే బరువు తూగడం కష్టమని చెప్పబడుతుంది 
తనకుతాను  తగ్గించుకున్నోడే హెచ్చింపబడతాడని లిఖించబడుతుంది 
నీ డైరీలో 
అనుకుంటావు కానీ ...
నీ నీడే అడ్డుగోడ కట్టుకొని 
“ చలో ఎక్ బార్ ఫిర్సే అజ్నబీ  బంజాయే హం దోనో “ అని
నీ ముందే పాడినప్పుడు 
ఏదీ అనుకున్నంత ఈజీ కాదని  తెలుస్తుంది 
~ పారువెల్ల ~

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com