ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- September 20, 2025
హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) యాజమాన్యం ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. పండుగల సమయంలో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ ఛార్జీలో 50 శాతం వరకు అదనపు వసూలు ఉంటుందని, ఇది 2003 నాటి ప్రభుత్వ జీవో నంబర్ 16 ప్రకారం కొనసాగుతున్న ఒక ఆనవాయితీ అని వివరించింది.
ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి వంటి సమయాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడుపుతుంది. ఈ బస్సులు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడానికి హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతాయి. అయితే, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తుంటాయి. ఈ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులను భర్తీ చేయడానికి, టికెట్ ధరను సాధారణ ఛార్జీలో 50 శాతం వరకు పెంచుకోవచ్చని 2003లో ప్రభుత్వం జీవో నంబర్ 16 జారీ చేసింది. ఇది అన్ని బస్సులకు కాదని, కేవలం స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ రద్దీకి అనుగుణంగా రోజూ 500 నుంచి 1,000 వరకు స్పెషల్ బస్సులను నడుపుతుంది. ఈ నెల 20వ తేదీ, అలాగే 27 నుండి 30వ తేదీ వరకు, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీల సవరణ ఉంటుంది. మిగతా రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. పండుగల సమయంలో అన్ని బస్సుల్లోనూ చార్జీలు పెంచారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు