డిసెంబర్ 5న ‘అఖండ–2’ రిలీజ్

- September 23, 2025 , by Maagulf
డిసెంబర్ 5న ‘అఖండ–2’ రిలీజ్

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అఖండ-2’ (Akhanda 2)సినిమా విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ బాలయ్య డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ధృవీకరించారు. ఇప్పటికే ఈ సిరీస్‌కు ఉన్న పాపులారిటీ, బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఘన విజయాల కారణంగా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మొదటి భాగం ‘అఖండ’లో బాలయ్య చేసిన ఆఘోర పాత్ర ప్రేక్షకుల్లో అమితమైన హైప్‌ను క్రియేట్ చేయడంతో, సీక్వెల్‌పై ఆతృత మరింత పెరిగింది.

‘అఖండ-2’ను ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. హిందీ సహా ఇతర భాషల్లోనూ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, బోయపాటి శ్రీను స్వయంగా ఆ డబ్బింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేశారని బాలయ్య వెల్లడించారు. దాంతో సినిమా కేవలం దక్షిణ భారతంలోనే కాకుండా, ఉత్తర భారతంలోనూ మంచి రేంజ్‌లో రిలీజ్ కానుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్యకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్, బోయపాటి శ్రీను మాస్ టచ్ కలిసొస్తే జాతీయస్థాయిలోనూ మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బాలకృష్ణ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో ‘అఖండ-2’ ప్రమోషన్స్‌ను వేగంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, పోస్టర్లు ట్రెండ్ అవుతుండగా, టీజర్ రిలీజ్ అయితే మరింత ఊపు రానుంది. డిసెంబర్ 5న విడుదలవుతున్నందున దీపావళి నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగనున్నాయని సమాచారం. బాలయ్య, బోయపాటి కాంబో మరోసారి బాక్సాఫీస్ వసూళ్లను కైవసం చేసుకుంటుందన్న అంచనాలతో అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com