ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్

- September 24, 2025 , by Maagulf
ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్

తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు బుధవారం తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శనతో పాటు రామ్ భగీచా-2 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియా సెంటర్‌లో చైర్మన్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందని తెలిపారు. తిరుమలలో రవాణా, క్యూ లైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయుర్వేద, అటవీ శాఖ, శిల్పకళాశాల స్టాల్స్‌ను ఆయన అభినందించగా, టీటీడీ పబ్లికేషన్స్, అగరబత్తి స్టాల్‌ను కూడా సందర్శించారు.
గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్ప అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చైర్మన్ కొనియాడారు. అదేవిధంగా, బెంగళూరుకు చెందిన కళాకారిణి గౌరి రూపొందించిన సైకత శిల్పంలో ఆనందనిలయ విమాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని, వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి,జానకీదేవి,శాంతారామ్,నరేష్ కుమార్,  జంగా కృష్ణమూర్తి, చీఫ్ పీఆర్వో డా.టి.రవి, గార్డెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఎస్వీ శిల్ప కళాశాలకు  చెందిన  వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com