కరూర్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే విజయ్.

- September 28, 2025 , by Maagulf
కరూర్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే విజయ్.

తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. వీరిలో 16మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. అనేకమంది గాయపడ్డారు.. 58మంది కరూర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరికి దళపతి విజయ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట ఘటనలో మరణించిన 39మంది కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

నిన్న కరూర్ ఘటనతో నా హృదయం ముక్కలైంది. మన ప్రియమైన వారిని కోల్పోయిన అపారమైన దు:ఖం మధ్యలో నేను పడే బాధ మాటల్లో వర్ణించలేనిది. నా కళ్లు, మనస్సు దు:ఖంతో నిండిపోయాయి. ఈ ఘటన నిజంగా పూడ్చలేని నష్టం. ఎవరు ఓదార్పు మాటలు చెప్పినా, మన ప్రియమైన వారిని కోల్పోవడం భరించలేనిది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల రూపాయలు అందించాలని నేను భావిస్తున్నాను. ఈ నష్టాన్ని డబ్బుతో పూడ్చలేమని నాకు తెలుసు. అయినప్పటికీ, ఈ సమయంలో, మీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, నా ప్రియమైనవారిగా మీకు అండగా నిలబడటం నా కర్తవ్యం. అని విజయం పేర్కొన్నారు.

కరూర్‌ తొక్కిసలాట బాధితులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షల సాయం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.50వేల సాయం అందిస్తామన్న మోదీ వెల్లడించారు. రాజకీయ ప్రచారసభలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com