ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..

- October 04, 2025 , by Maagulf
ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..

న్యూ ఢిల్లీ: ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద తరచూ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా కొత్త నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రహదారి ప్రయాణికులకు, ముఖ్యంగా తరచూ టోల్ గేట్లు దాటే డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, కార్ యజమానులకు ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది.

చెల్లని ఫాస్టాగ్‌తో టోల్ గేట్ దాటే వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా ఏదైనా వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేక అది చెల్లకపోయినా, పని చేయకపోయినా.. సాధారణ టోల్ రుసుము కంటే కేవలం 1.25 రెట్లు మాత్రమే అదనంగా చెల్లించి టోల్ గేట్ దాటవచ్చు.

అయితే ఈ మొత్తాన్ని యూపీఐ (UPI) ద్వారా చెల్లించేందుకు అనుమతి ఉంటుంది.ప్రస్తుతం.. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ లేని వాహనదారులు సాధారణంగా ఉండే టోల్ ఛార్జీ కంటే రెట్టింపు జరిమానాను నగదు రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

ఈ కొత్త నిర్ణయం ద్వారా ఆ భారీ జరిమానా భారం నుంచి వాహనదారులకు విముక్తి లభిస్తుందని దీపక్ దాష్ నివేదించారు. ఉదాహరణకు ఫాస్టాగ్ ఉన్న వారు రూ.100 చెల్లిస్తే.. ఫాస్టాగ్ లేని వారు నగదు రూపంలో రూ.200 చెల్లించాలి.

కానీ యూపీఐ (UPI) ద్వారా చెల్లిస్తే కేవలం రూ.125 చెల్లిస్తే సరిపోతుందని సర్కారు స్పష్టం చేసింది.ఫాస్టాగ్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం టోల్ వసూలు సంస్థలకు బాధ్యతను పెంచేలా ఉంది. ఒకవేళ మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే, పని చేసే ఫాస్టాగ్ ఉన్నప్పటికీ..

టోల్ ప్లాజా వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ టోల్ వసూలు మౌలిక సదుపాయాలు పని చేయకపోయినా, సాంకేతిక లోపం కారణంగా టోల్ వసూలు చేయడంలో విఫలమైనా.. ఆ వాహనాన్ని ఎటువంటి చెల్లింపు లేకుండానే టోల్ ప్లాజాను దాటడానికి అనుమతిస్తారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ వసూళ్లలో దాదాపు 98 శాతం ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే టోల్ వసూలు చేసే ఏజెన్సీలు ఎలక్ట్రానిక్ వసూలు వ్యవస్థను నాణ్యతతో నిర్వహించేలా, లోపాలు లేకుండా చూసేలా వారిపై బాధ్యత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. టోల్ వసూలు వ్యవస్థలో లోపం ఉంటే.. ఆ భారాన్ని ప్రజలు మోయకుండా.. ఆయా ఏజెన్సీలే బాధ్యత వహించేలా ఈ కొత్త నియమం పనిచేస్తుంది.

ఫాస్టాగ్ లేని లేదా పని చేయని వారికి 1.25 రెట్లు మాత్రమే జరిమానా వసూలు చేయడం వలన ప్రజల ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ఇంతకుముందు చెల్లించిన రెట్టింపు జరిమానా మొత్తం వాహనదారులకు భారంగా ఉండేది. కొత్త నిబంధన ద్వారా టెక్నాలజీని ప్రోత్సహించడం, అదే సమయంలో సాధారణ ప్రయాణికులకు ఉపశమనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com