ట్రక్కుల పై 25 శాతం టారీఫ్‌లు విధించిన ట్రంప్‌

- October 07, 2025 , by Maagulf
ట్రక్కుల పై 25 శాతం టారీఫ్‌లు విధించిన ట్రంప్‌

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అమెరికాలోకి దిగుమతి చేసుకునే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై నవంబర్ 1 నుండి 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. విదేశీ పోటీ నుండి అమెరికన్ తయారీదారులకు మద్దతు ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య రక్షణవాదాన్ని తన ఆర్థిక ఎజెండాలో కీలకమైన అంశంగా చేసుకున్న ట్రంప్, దేశీయ ట్రక్ తయారీదారులను అన్యాయమైన బయటి పోటీ నుండి రక్షించడానికి సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుండి ఇతర దేశాల నుండి అమెరికాకు వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25 శాతం రేటుతో సుంకం విధిస్తామని అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. గత నెలలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా భారీ ట్రక్కుల దిగుమతులపై సుంకాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని ట్రంప్ మొదట్లో సూచించారు. కొత్త సుంకాలు పాక్కర్ యాజమాన్యంలోని పీటర్‌బిల్ట్, కెన్‌వర్త్ వంటి కంపెనీలతో పాటు డైమ్లర్ ట్రక్, ఫ్రైట్‌లైనర్‌కు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు.

న్యాయాన్ని పునరుద్ధరించడానికి, మా కార్మికులను రక్షించడానికి ఈ సుంకాలు అవసరం అని ట్రంప్ వైట్ హౌస్ వద్ద అన్నారు. విదేశీ డంపింగ్, అన్యాయమైన పద్ధతుల ద్వారా మా పరిశ్రమలు అణగదొక్కుతుంటే మేం చూస్తూ ఊరుకోమని ట్రంప్‌ తెలిపారు. ప్రస్తుతం జపాన్, యూరోపియన్ యూనియన్‌తో ఉన్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం.. అమెరికా తేలికపాటి వాహనాలపై 15 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే కొత్త నిర్ణయం తర్వాత ఆ రేటు ఆయా వాహనాలకు వర్తిస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. కెనడా, మెక్సికోలో అసెంబుల్ చేసే తేలికపాటి వాహనాలపై విధించిన సుంకాల నుండి అమెరికా తయారు చేసిన భాగాల విలువను తగ్గించుకోవడానికి ట్రంప్ పరిపాలన గతంలో తయారీదారులను అనుమతించింది. మిత్రదేశాలపై ఎఫెక్ట్‌.. కొత్త సుంకం అనేక విదేశీ తయారీదారులు, ఎగుమతిదారులను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్ అమెరికాకు ట్రక్కుల ఎగుమతి చేస్తున్న ముందు వరుసలో ఉన్న ఐదు దేశాలు. ప్రభుత్వ డేటా ప్రకారం.. అమెరికాకు మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులను అత్యధికంగా ఎగుమతి చేసే మెక్సికో 2019 నుండి ఈ వాహనాల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి దాదాపు 340,000 యూనిట్లకు చేరుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA) ప్రకారం మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులు ఉత్తర అమెరికాలో కనీసం 64 శాతం విలువను భాగాలు, పదార్థాలు లేదా శ్రమ ద్వారా ఉత్పత్తి చేస్తే సుంకం లేకుండా కదులుతాయి. కొత్త 25 శాతం సుంకం ఈ ఏర్పాటుకు అంతరాయం కలిగించవచ్చు, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రధాన ఆటోమేకర్లపై ప్రభావం చూపుతుంది. మెక్సికోలో రామ్ ట్రక్కులు, వాణిజ్య వ్యాన్లను ఉత్పత్తి చేసే స్టెల్లాంటిస్ వంటి ఆటోమేకర్లు అధిక ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు. మెక్సికన్ తయారీ వాహనాలపై అధిక సుంకాలను నివారించడానికి కంపెనీ వైట్ హౌస్‌ను లాబీయింగ్ చేసినట్లు సమాచారం. స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్ మెక్సికోలోని మోంటెర్రీలో 2026లో కార్యకలాపాలు ప్రారంభించే కొత్త హెవీ-ట్రక్ ఫ్యాక్టరీలో 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com