మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!

- October 16, 2025 , by Maagulf
మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన, నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి
ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల్లో ప్రధానమైనది ఇకపై ప్రతి మద్యం బాటిల్‌ను ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా స్కానింగ్ చేసిన తర్వాతే దుకాణం, బార్ యజమానులు అమ్మాలి.

  • బోర్డుల ప్రదర్శన: ప్రతి దుకాణం, బార్ వద్ద “ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనదని ధృవీకరించాం” అనే బోర్డులను ప్రత్యేకంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
  • ప్రామాణికత ధృవీకరణ: వినియోగదారులకు విక్రయించే ముందు, మద్యం బాటిల్‌పై ఉన్న సీల్, క్యాప్, హోలోగ్రామ్ స్థితిని తనిఖీ చేసి, దాని ప్రామాణికతను ధృవీకరించాలని నిబంధన విధించింది.
  • రిజిస్టర్ నిర్వహణ: ప్రతి దుకాణం, బార్‌లో ‘డైలీ లిక్కర్ జెన్యునెస్ వెరిఫికేషన్ రిజిస్టర్’ను తప్పనిసరిగా అమలు చేయాలి. క్యూఆర్ కోడ్ తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ ఫలితాలను ఈ రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

అధికారుల పర్యవేక్షణ, చర్యలు
ఎక్సైజ్ సిబ్బంది ప్రతిరోజూ మద్యం దుకాణాలు, బార్లలో ర్యాండమ్ విధానంలో తనిఖీలు చేయాలని, తనిఖీల వివరాలను దుకాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేసి రోజూ సంతకం చేయాలని పేర్కొంది. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌పై లైసెన్స్‌దారు సంతకం చేయాలని నిబంధనల్లో ఉంది. నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com