ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్

- October 21, 2025 , by Maagulf
ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్

ఆస్ట్రేలియా: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఐటీ,విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్నారు.ఈ సందర్భంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ని సందర్శించిన మంత్రి, అక్కడి పరిశోధకులు,వర్సిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వర్సిటీతో కలిసి పని చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను తట్టుకునే పంటలు, స్మార్ట్ ఫార్మింగ్, కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవసాయ పరిష్కారాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రతిపాదనలు చేశారు.

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి వర్సిటీ భాగస్వామ్యం కావాలని సూచించిన మంత్రి, రైతులకు శిక్షణ కార్యక్రమాలు, పరిశోధనల మార్గదర్శకంతో వ్యవసాయ రంగంలో స్థిరమైన పరిష్కారాలను అందించాలని కోరారు. స్మార్ట్ ఇరిగేషన్, ఏఐ, IoT ఆధారిత వ్యవసాయ పద్ధతులపై కలిసి పనిచేయాలని వర్సిటీని కోరారు.

మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తమ విశ్వవిద్యాలయం స్థిరమైన అభివృద్ధిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, ప్రపంచ టాప్ 2% వర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని వారు తెలిపారు. అలాగే, ఇప్పటికే ఐఐటీలు, ఇతర భారతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవాన్ని ప్రస్తావించారు. తమ అనుబంధ సంస్థ హాక్స్‌బరీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎన్విరాన్‌మెంట్ ద్వారా భూసారం, నీటి నిర్వహణ, పంట దిగుబడి పెంపు వంటి రంగాల్లో విస్తృత పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. ఏఐ, సెన్సార్ టెక్నాలజీ, IoT ఆధారిత వ్యవసాయ పద్ధతుల అభివృద్ధిలో తమ విశేష నైపుణ్యం ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com