చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత

- October 21, 2025 , by Maagulf
చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత

అమెరికా: చెస్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ, ప్రముఖ అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నరోడిట్స్కీ (29) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఆయన ఆకస్మిక మృతి పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ఆయన మరణం సహజం కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉండవచ్చని మరో అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్ చేసిన ఆరోపణలు చెస్ క్రీడాలోకంలో కలకలం రేపుతున్నాయి.

డానియల్ నరోడిట్స్కీ అక్టోబర్ 19న కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.ఈ ప్రకటనను షార్లెట్ చెస్ సెంటర్ పంచుకుంది. “ప్రతిభావంతుడైన చెస్ క్రీడాకారుడు, శిక్షకుడు అయిన డానియల్ ఆకస్మిక మరణవార్తను పంచుకోవడం మాకు చాలా బాధగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాము” అని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. అక్టోబర్ 2025 నాటికి 2619 ఫిడే రేటింగ్‌తో డానియల్ అమెరికాలో అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

డానియల్ నరోడిట్స్కీ మరణంపై రష్యాకు చెందిన ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డానియల్ మృతి వెనుక కుట్ర జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ, “అసలు ఏం జరిగింది? దీనిపై సరైన దర్యాప్తు జరగాలని ఆశిస్తున్నా” అని తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

చనిపోవడానికి ముందు డానియల్ చేసిన చివరి లైవ్ స్ట్రీమ్‌లో ఆయన మానసికంగా తీవ్ర అస్వస్థతతో కనిపించారని, పొంతన లేని మాటలు మాట్లాడారని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇది చూసి తాము ఆందోళన చెందామని కొందరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com