నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్

- October 28, 2025 , by Maagulf
నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్

న్యూ ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. శీతాకాలం ప్రారంభమైన ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పొల్యూషన్‌ స్థాయులు అత్యంత ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో పీఎం 2.5, పీఎం 10 కణాల మోతాదు పెరగడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రధాన చర్యలు ప్రారంభించింది. నవంబర్‌ 1 నుంచి BS-4, BS-5 డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. నగరంలోమాత్రం BS-6 ప్రమాణాలకు లోబడిన వాహనాలకే అనుమతి ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది.

ఈ నిర్ణయం ప్రకారం.. వాహనాలపై తనిఖీలు కఠినతరం చేయాలని ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు విభాగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాన ఎంట్రీ పాయింట్లు అయిన గజీాపూర్‌, ఆనంద్‌ విహార్‌, సింగ్‌ బార్డర్‌, కపసెరా వంటి ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. పాత వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు సీసీటీవీల సహాయంతో చర్యలు చేపట్టనున్నారు.

ఢిల్లీలో పొల్యూషన్‌ నియంత్రణ చర్యలలో ఇది కీలక దశగా భావిస్తున్నారు. ప్రతీ సంవత్సరం పంట అవశేషాల దహనం, వాహనాల ఉద్గారాలు, నిర్మాణాదులు కలసి వాతావరణ నాణ్యతను దిగజారుస్తున్నాయి. మున్ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పాత వాహనాల వినియోగాన్ని పూర్తిగా ఆపేందుకు ఢిల్లీ ప్రభుత్వం దీర్ఘకాల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. వాతావరణ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, BS-6 వాహనాల వలన ఉద్గారాలు దాదాపు 40-50 శాతం తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ వాహనాలు కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com