బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..

- November 02, 2025 , by Maagulf
బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిప్పంటించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకొని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆవరణంలో ప్లెక్సీలు చింపేశారు. ఆ తరువాత ఫర్నీచర్ కు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. మా పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, దహనం చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోతుంది. 60లక్షల బీఅర్‌ఎస్ కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని కేటీఆర్  సూచించారు. త్వరలోనే మణుగూరును సందర్శించి, అదే ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి నిర్మాణం చేసుకుందామని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. దీనికి చరమగీతం పాడే రోజు దగ్గరల్లోనే ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే.. గతంలో ఆ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండేది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగా కాంతారావు విజయం సాధించారు. కొద్దికాలం తరువాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాడు. కాంగ్రెస్ కార్యాలయంను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్తలు రేగాకాంతారావు తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన రేగా కాంతారావు ఓడిపోయారు.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో మళ్లీ కార్యాలయం వివాదం తెరమీదకు వచ్చింది. దీంతో ఆదివారం ఉదయం కార్యాలయం వద్దకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నీచర్ ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com