ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..

- November 06, 2025 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల పేరును మార్చుతున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి వీటిని ‘విజన్ యూనిట్స్’ గా పిలుస్తామని, సమర్ధవంతంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా రూపొందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

సచివాలయంలో డేటా-డ్రివెన్‌ గవర్నెన్స్‌ – పాలనలో టెక్నాలజీ – ఆర్టీజీఎస్‌తో సమన్వయంపై మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చి సమర్థవంతంగా వాడాలని సూచించారు.

సమర్ధ పాలన అందించాలంటే అందుకు అనుగుణంగా సామర్ధ్యాలు, నైపుణ్యం అవసరం. అలాగే విస్తృతమైన, కచ్చితమైన సమాచారంతోనే ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోగలం. ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తున్నప్పుడు మళ్లీ ప్రజల్ని కార్యాలయాలకు రప్పించటం ఎందుకన్నది ఆలోచించాలి. దేవాదాయశాఖ అందిస్తున్న సేవల విషయంలో భక్తులు అంతా క్షేత్రస్థాయికి వస్తారు. రెవెన్యూ సహా ఇతర శాఖల సేవలు వీలైనన్ని ఆన్ లైన్ లేదా, వాట్సప్ గవర్నెనెన్సు ద్వారానే అందాలి. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు అన్నారు.

అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నం అయ్యే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ప్రజలకు అందే ప్రతీ సేవలోనూ ప్రమాణాల్ని నెలకొల్పాల్సి ఉందని చంద్రబాబు అధికారులకు సూచించారు. అదేసమయంలో ప్రజల నుంచి అందే ఫిర్యాదుల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు సరిగ్గా వ్యవహరించాలి. ఆర్దికేతర, చట్టపరమైన ఫిర్యాదుల విషయంలో ఆలస్యం జరగడం సరికాదు. గత పాలకుల వల్ల 22ఏ లాంటి వివాదాలు పెద్దఎత్తున తలెత్తాయి. రికార్డులు కూడా తారుమారు చేశారు. వాటిని పరిష్కరించే విషయంలో యంత్రాంగం అత్యంత భాద్యతగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

ప్రభుత్వ యంత్రాంగం అందించే నాణ్యమైన సేవలతోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. 15శాతం వృద్ధిరేటు దిశగా మనం అడుగులు వేస్తున్నామని, అధికార యంత్రాంగం అంతా దీనికి బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో బాధ్యతతో కూడిన ప్రభుత్వం ఉంది కాబట్టే గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మన రాష్ట్రం నాలెడ్జి ఎకానమీ దిశగా వేగంగా అడుగులు ముందుకేయాలి. అప్పుడే విజన్ లక్ష్యసాధన సులభం అవుతుందని చంద్రబాబు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com