80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్

- November 07, 2025 , by Maagulf
80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా: అమెరికాలో వీసా నియమాల ఉల్లంఘన, అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన, దేశ భద్రత మరియు చట్టపరమైన వ్యవస్థను కాపాడే క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడిన విదేశీయులపై ఉక్కుపాదం మోపింది. అధికారిక వివరాల ప్రకారం, జనవరి నెల నుండి ఇప్పటివరకు సుమారు 80 వేల వీసాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. ఇందులో టూరిస్టులు, వర్క్ వీసా హోల్డర్లు, స్టూడెంట్లు మరియు బిజినెస్ ప్రయాణికులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం “అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరూ చట్టబద్ధమైన పద్ధతుల్లోనే ఉండాలి” అన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది.

అధికారుల ప్రకారం, వీసా రద్దయినవారిలో ఎక్కువ మంది హింసాత్మక ఘటనలు, దాడులు, చోరీలు, మత్తులో వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి నేరాలకు పాల్పడినవారని తెలిపారు. వీరిలో కొందరు వర్క్ వీసాతో వచ్చిన వారు స్థానిక చట్టాలను పట్టించుకోకపోవడంతో, మరికొందరు టూరిస్టు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారని అధికారులు పేర్కొన్నారు. అమెరికా న్యాయ విభాగం, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ సంయుక్తంగా ఈ చర్యలను చేపట్టి, వీసా దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

అదేవిధంగా, 6 వేలకుపైగా విదేశీ విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. వీరిలో కొందరు చదువుల పేరుతో వచ్చి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు లేదా చట్టవ్యతిరేక పనులు చేస్తున్నట్లు తేలింది. గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లకుండా ఉండటం, ఫ్రాడ్ డాక్యుమెంట్స్ వాడటం వంటి కారణాలతో ఈ వీసాలు రద్దు చేసినట్లు మీడియా వెల్లడించింది. ట్రంప్ ప్రభుత్వం వీసా వ్యవస్థను కట్టుదిట్టం చేయడమే కాకుండా, భవిష్యత్తులో వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కఠినంగా ఉండేలా మార్పులు చేయాలని సంకేతాలు ఇస్తోంది. ఈ నిర్ణయాలు విదేశీ విద్యార్థులు మరియు వీసా ఆధారిత ఉద్యోగులపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com