సినిమా రివ్యూ: ‘రాజు వెడ్స్ రాంబాయి’.!

- November 21, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘రాజు వెడ్స్ రాంబాయి’.!

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ టైమ్‌లో ఖమ్మం - వరంగల్ జిల్లాల మధ్య వున్న ఓ పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటనే ఈ సినిమా. కొన్ని సినిమాటిక్ అంశాల్ని జోడించి, యదార్ధ సంఘటనల ఆధారంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో చిత్ర యూనిట్ చాలా చాలా యాక్టివిటీస్ చేసింది. దర్శకుడు సాయిలు కంభంపాటి కొన్ని సవాళ్లు కూడా విసిరాడు. అలాగే, కిరణ్ అబ్బవరం ప్రత్యేక అతిధిగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకింత ఆసక్తిని కనబరిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా రిలీజ్‌కి ముందు క్రియేట్ చేసిన హంగామా, ఆసక్తి అంతా ఇంతా కాదు. మరి ఆ హంగామా అంతా నిజం చేసేలా ఈ సినిమా కథ వుందా.? ‘రాజు వెడ్స్ రాంబాయి’కి ఆ స్థాయిలో హిట్టు దక్కతుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
అనగనగా అదొక పల్లెటూరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ టైమ్‌లో ఆ పల్లెటూరిలో రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ వాయించే కుర్రోడు. ఆ ఊరిలో పెళ్లయినా, చావయినా ఏ కార్యక్రమం జరిగినా రాజు బ్యాండ్ మోత మోగాల్సిందే. అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయి (తేజస్వీ రావు) అంటే రాజుకు చిన్నప్పట్నుంచీ పిచ్చి ప్రేమ. మొదట్లో రాజు ప్రేమని తిరస్కరించిన రాంబాయి, ఆ తర్వాత అతని ప్రేమిలోని నిజాయితీ మెచ్చి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. మరోవైపు కూతురంటే పంచ ప్రాణాలైన వెంకన్న(చైతన్య జొన్నలగడ్డ), తన కూతురుని గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తికిచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ, రాజు, రాంబాయిల ప్రేమ వ్యవహారం ఊరంతా తెలిసిపోతుంది. దాంతో, మూర్ఖంగా, అత్యంత క్రూరంగా వెంకన్న తన కూతురు విషయంలో బిహేవ్ చేస్తాడు. ఎలాగైనా రాజు నుంచి తన కూతురును విడదీయాలనుకుంటాడు. అందుకోసం లవర్స్ ఇద్దరూ ఓ తీవ్రమైన నిర్ణయానికి వస్తారు. రాజు కారణంగా రాంబాయ్ గర్భవతి అయితే, ఎలాగైనా వెంకన్న వీరిద్దరి పెళ్లి చేస్తాడని భావించి ఆ ప్రయత్నంలో వుంటారు. మరి, ఆ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది. వెంకన్న బారి నుంచి ఈ ప్రేమ జంట తప్పించుకోగలిగిందా.? ఒక్కటయ్యిందా.? తెలియాలంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీ నటుల పనితీరు:
హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్త వారే. కానీ, కథకు తగ్గట్లుగా చాలా చక్కగా నటించారు. కొన్ని చోట్ల సహజ సిద్ధమైన నటన కనబరిచారు. లవర్స్‌గా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరింది. కొన్ని చోట్ల హీరోయిన్ తేజస్వీ పలికించిన హావ భావాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయ్. తెలంగాణా యాస కూడా చక్కగా కుదరింది. అటు తండ్రి ప్రేమనీ, ఇటు ప్రేమికుడి పిచ్చి ప్రేమనీ అర్దం చేసుకోలేని సంఘర్షణలో సతమతమయ్యే అమ్మాయిగా తేజస్వి నటన ఆకట్టుకుంటుంది. అలాగే అటు తండ్రి, ఇటు లవర్ చేతుల్లో దెబ్బలు తినే సన్నివేశంలో బాధనిపిస్తుంది. ఆయా సన్నివేశాల్లో హీరో పాత్ర కోపం తెప్పించేలా వుంటుంది కూడా.  హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన చైతన్య జొన్నలగడ్డకు ఈ సినిమాలో క్యారెక్టర్ కాస్త ఛాలెంజింగ్ అనే చెప్పాలి. పాత్ర చిత్రీకరణ బావుంది. కానీ, ఆ స్థాయిలో ఆ పాత్ర నుంచి పండాల్సిన ఎమోషన్ కానీ, భయం కానీ కనిపించదు. అందుకు ఆర్టిస్ట్ తప్పేమీ లేదు.కానీ, రాతలో అంత బలం లేకపోవడం ఓ కారణం కావచ్చు. సహన పరీక్షలా అనిపిస్తుంది. కొన్ని సార్లయితే, విసుగు, చిరాకు తెప్పిస్తుందీ పాత్ర. మరో పాత్ర శివాజీ రాజా అర్ధాంతరంగా ఈ పాత్రని చంపేసి ఒకింత డైరెక్టర్ తప్పు చేశాడు. అంత అవసరం లేదన్న అభిప్రాయాలొస్తాయ్. రొటీన్ స్టోరీ అనే ఒపీనియన్ కలుగుతుంది ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఓ ఎమోషన్ క్రియేట్ చేయాలి కాబట్టి.. కావాలనే ఆ పాత్రని లేపేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయ్. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, మిగిలిన పాత్రలు కథకి తగ్గట్టుగా నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ ప్రేమకథలు తెరకెక్కించిన వేణు ఊడుగుల ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం వహించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దర్శకుడు సాయిలు కంభంపాటి తనకు తెలిసిన ఓ యదార్ధ గాధని ఇలా ఓ చిన్న ప్రయత్నంగా సినిమా తెరకెక్కించాడు. తాను అనుకున్న కథని తనకున్న పరిధిలో బాగానే ప్రొజెక్ట్ చేశాడు. కానీ, అక్కడక్కడా దొర్లిన చిన్న చిన్న తప్పులు, సాగతీత సన్నివేశాలు ఒకింత సహనానికి పరీక్ష పెడతాయ్. ఎడిటింగ్‌లో ఇంకాస్త ఫోకస్ పెట్టి వుంటే బావుండేది. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు ఏదో చిన్న సినిమాకి అన్నట్లుగా కాకుండా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. అప్పటి తెలంగాణా నేటివిటీని బాగా క్యాప్చర్ చేసి చూపించారు. ఓవరాల్‌గా టెక్నికల్ సపోర్ట్ బాగానే వుంది. సినిమాకి సంబంధించి క్లైమాక్స్‌పై ముందుగానే ఆసక్తి పెంచేశారు. అందుకు తగ్గట్లుగానే క్లైమాక్స్ వుంటుంది. ఒకింత ఈ ప్రేమకథకిచ్చిన ముగింపు జుగుప్స కలిగించడంతో పాటూ, హార్ట్ హిట్టింగ్‌గానూ అనిపిస్తుంది. అయితే, ఈ తరహా ఎండింగ్ సినిమాలు గతంలో కొన్ని అనూహ్యంగా సక్సెస్ అయిన సందర్భాలూ వున్నాయ్. కొన్ని దారుణంగా ఫెయిలైన సందర్భాలూ వున్నాయ్. మరి, ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందనేది వెయిట్ చేయాల్సిందే.

ప్లస్ పాయింట్స్: హీరో, హీరోయిన్ల పర్‌ఫామెన్స్, అక్కడక్కడా యూత్ కనెక్టింగ్ సన్నివేశాలు, భావోద్వేగాలు, మనసును కదిలించే క్లైమాక్స్..

మైనస్ పాయింట్స్:
సాగతీత సన్నివేశాలు, అనవసరమైన ఎమోషన్లు..

చివరిగా:
‘రాజు వెడ్స్ రాంబాయి’.! రిజల్ట్ ప్రేక్షకుల చేతుల్లోనేనోయి.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com