కెనడా కొత్త పౌరసత్వ చట్టం

- November 24, 2025 , by Maagulf
కెనడా కొత్త పౌరసత్వ చట్టం

కెనడా తమ పౌరసత్వ చట్టాలలో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది.ఈ మార్పులు అమల్లోకి వస్తే విదేశాల్లో పుట్టిన భారతీయ మూలాల కుటుంబాలకు ప్రత్యేక ప్రయోజనం కలుగవచ్చు.

కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి లీనా మెట్లేగ్ డియాబ్ తెలిపిన ప్రకారం, బిల్ C-3 పాత చట్టాల వల్ల పౌరసత్వం కోల్పోయిన లేదా పొందలేని వారందరికీ న్యాయం చేస్తుందని చెప్పారు. విదేశాలలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చే నిబంధనలను ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుతున్నట్టు తెలిపారు.

2009లో వచ్చిన మొదటి–తరం పరిమితి నియమం ప్రకారం, విదేశంలో పుట్టిన పిల్లలు పౌరసత్వం పొందాలంటే వారి తల్లిదండ్రుల్లో ఒకరు కెనడాలో పుట్టినవారు కావాలి లేదా అక్కడే న్యాచురలైజ్‌ అయి ఉండాలి. 2023లో ఒంటారియో కోర్టు ఈ నిబంధన రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పు ఇచ్చింది. కెనడా ప్రభుత్వం ఆ తీర్పును అంగీకరించి (Canada citizenship changes) అప్పీల్ చేయకుండా ఉపసంహరించుకుంది.

ఈ నియమం వల్ల “లాస్ట్ కెనడియన్స్” అని పిలవబడే పెద్ద సమూహం పౌరసత్వం కోల్పోయింది. వారు పౌరసత్వానికి అర్హులమేనని భావించినప్పటికీ పాత చట్టాల వల్ల బయటపడ్డారు.

బిల్ C-3 ప్రకారం, విదేశంలో పుట్టిన కెనడియన్ పౌరుల పిల్లలకు పౌరసత్వం ఇవ్వడానికి “సబ్‌స్టాంశియల్ కనెక్షన్ టెస్ట్” అమలు చేయబడుతుంది. అంటే, శిశువు పుట్టే ముందు లేదా దత్తతకు ముందు, ఆ తల్లిదండ్రి కనీసం 1,095 రోజులు కెనడాలో నివసించి ఉండాలి. యూఎస్, యూకె, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఇదే విధానం ఉంది.

ఈ చట్టం అమలు కోసం కోర్టు 2026 జనవరి వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌరసత్వ దరఖాస్తులు భారీగా పెరగవచ్చని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భావిస్తున్నారు.

1947లో వచ్చిన కెనడా సిటిజెన్షిప్ చట్టం వల్ల అనేక మంది పౌరసత్వం కోల్పోయారు. తర్వాత 2009, 2015లో మార్పులతో చాలా మందికి పౌరసత్వం తిరిగి లభించింది. కానీ 2009 నిబంధన వల్ల విదేశంలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం రాలేదు. 2023లో కోర్టు దీన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చడంతో ప్రభుత్వం మార్పులకు ముందుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com