కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- December 17, 2025
న్యూ ఢిల్లీ: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక సమస్యలపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఢిల్లీలో కేంద్ర భూమి మరియు శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ను కలిసి విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి రెండు ప్రధాన అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.
కోడూరు మండలంలో అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల దుస్థితి
కోడూరు మండలంలో అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు పూర్తిగా పాడైపోవడంతో సుమారు 6 వేల ఎకరాల వ్యవసాయ భూమిలో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని ఎంపీ వివరించారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న కృష్ణా నదిలోకి వెళ్లే ప్రధాన, మధ్యస్థ, చిన్న కాలువల వద్ద గతంలో సముద్రపు నీరు లోపలికి రాకుండా నిరోధించేందుకు నిర్మించిన అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు.
సముద్ర అలల ప్రభావం, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇవి పనిచేయని పరిస్థితిలో ఉన్నాయని, ఫలితంగా అలల ఉప్పెనల సమయంలో ఉప్పునీరు కాలువల్లోకి ప్రవేశించి అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి, కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం దక్షిణ మండలాల్లో ఉప్పునీరు మునిగిపోవడం, దీర్ఘకాలిక డ్రైనేజీ సమస్యలు, పంట నష్టం, వ్యవసాయ ఉత్పాదకత కోల్పోవడం జరుగుతోందని తెలిపారు.
ఈ సమస్యల వల్ల రైతులు మరియు ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయని, శాస్త్రీయ అంచనాల ఆధారంగా అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల పునర్నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. విపత్తు ఉపశమన నిధులు (NDMA) మంజూరుకు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) అవసరమని, చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (NCCR) నుండి సాంకేతిక బృందాన్ని వెంటనే క్షేత్ర పరిశీలనకు పంపించి DPR సిద్ధం చేయాలని కోరారు.
చినగొల్లపాలెం తీరప్రాంతంలో తీవ్రమైన సముద్ర కోత
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామంలో తీరప్రాంతం తీవ్ర సముద్ర కోతకు గురవుతోందని ఎంపీ వివరించారు.గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సముద్ర కోత కారణంగా భూములు, ఇళ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటుండటంతో పాటు మత్స్యకారులు, స్థానికుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని తెలిపారు. తక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే గ్రామం మునిగిపోయే ముప్పు ఉందని హెచ్చరించారు.
సముద్ర కోతను తగ్గించేందుకు గ్రోయిన్లు, సముద్ర గోడలు తదితర తీర రక్షణ చర్యలు అవసరమని, ఈ పనులను రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) పరిధిలో చేపట్టాలని వివరించారు. ఈ విషయంపై ది హిందూ ఇంగ్లీష్ దినపత్రికలో వార్తలు ప్రచురితమయ్యాయని తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పటికే NCCR డైరెక్టర్‌తో చర్చించారని, చినగొల్లపాలెం DPR తయారీకి NCCR కన్సల్టెన్సీ రుసుముగా ₹38 లక్షలు కోరిందని, జిల్లా యంత్రాంగం బడ్జెట్ కేటాయింపులపై ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం నుంచి సానుకూల స్పందన
ఈ రెండు అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని, NCCR సాంకేతిక బృందాన్ని వెంటనే క్షేత్ర పరిశీలనకు పంపించి DPR సిద్ధం చేయాలని, SDMA మరియు NDMAలతో సమన్వయం చేసి నిధులు మంజూరు చేయాలని ఎంపీ బాలశౌరి కేంద్ర కార్యదర్శిని కోరారు.
దీనికి స్పందించిన కార్యదర్శి ఎం.రవిచంద్రన్, ఈ నెలాఖరులోగా ఢిల్లీ నుంచి శాస్త్రవేత్తల బృందాన్ని కృష్ణా జిల్లాకు పంపిస్తామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ పరిణామంతో కోడూరు మండల రైతులకు మరియు చినగొల్లపాలెం గ్రామస్తులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఆశలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







