కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ

- December 26, 2025 , by Maagulf
కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ

కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి అలయం గురువారం పోటెత్తిన భక్తుల రద్దీతో జనసంద్రంగా తయారైంది. సాధారణంగా ఆలయంలో వారంతపు రోజులు, వరుస సెలవు రోజుల్లో భక్తుల రద్దీ వుంటుంది. అయితే గత కొద్ది రోజులుగా శబరిమల ఆలయంలో దర్శనాలు ప్రారంభం కావడంతో అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళిన భక్తులు మరో వైపు ఓంశక్తి మాలధారణ చేసిన భక్తులు కాణిపాకం ఆలయ దర్శనార్థం భారీగా తరలివచ్చారు.అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కాణిపాకం స్వామి దర్శనం కోసం పెద్దఎత్తున తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు తిరుమల వెళ్ళే తీర్థజనం, అయ్యప్ప, ఓంశక్తి భక్తులు తరలిరావడంతో ఆలయంలో తీవ్రస్థాయిలో రద్దీ నెలకొంది. భక్తులు వేకువజామున నుండి స్వామి దర్శనంకోసం క్యూలైన్లలో బారులు తీరి నిలబడడంతో ఆలయంలోని క్యూలైన్లన్ని భక్తులతో కిటకిటలాడాయి.

ఆలయ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయం వెలుపల భక్తులు గంటల తరబడి స్వామి దర్శనం కోసం బారులు తీరి వేచి వుండాల్సిన పరిస్థితి నెలకొంది.100 రూపాయల శీఘ్రదర్శనం,150 రూపాయల అతిశీఘ్రదర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులు సైతం క్యూకాంప్లెక్స్, క్యూలైన్లులో గంటల తరబడి వేచివుండడం గమనార్హం. సర్వదర్శనం భక్తులు సమారు నాలుగు గంటలకు పైగా కూలైన్లులో స్వామివారి దర్శనం కోసం వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్ని జనసందంగా మారింది. దీనితో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com