అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు

- January 07, 2026 , by Maagulf
అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలోనే శతకం బాదిన రుతురాజ్ను ఎంపిక చేయకపోవడంతో సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా కొనసాగుతుండగా, గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా జట్టులోకి తిరిగొచ్చాడు. అయితే రుతురాజ్కు అవకాశం దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అంశంపై మాజీ భారత వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) తీవ్రంగా స్పందించాడు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అతడు వాపోయాడు.

‘మిత్రమా.. ఇలాంటి విషయాలను జీర్ణించుకోవడం చాలా కష్టం. అయినా సరే బాగా హర్డ్ వర్క్ చేయాలి. భారత క్రికెట్లో ఉన్న సవాళ్లలో ఇది కూడా ఒకటి. ఇలాంటి నిర్ణయాలు ఆటగాడిపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రధాన క్రికెట్ కేంద్రాల నుంచి రాకపోతే.. క్రికెటర్లు టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఏ విషయంలోనూ నిరుత్సాహపడకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్లను వెతుక్కోవాల్సిందే. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది' అని ఉతప్ప వ్యాఖ్యానించాడు.

రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) తన తొలి వన్డే మ్యాచ్ 2022లో ఆడాడు. అతడికి ఇప్పటి వరకు కేవలం 9 వన్డే మ్యాచ్ల్లో మాత్రమే టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. అతడు 28.50 యావరేజ్తో 228 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. గైక్వాడ్ ఇటీవల టీమిండియా, దక్షిణాఫ్రికాకు మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ల్లో పాల్గొన్నాడు. మొదటి వన్డేలో అతడు బ్యాటింగ్లో (8 పరుగులు) విఫలయ్యాడు. కానీ రెండో వన్డేలో సెంచరీ (105; 83 బంతుల్లో, 12 ఫోర్లు, 1 సిక్స్లు) చేశాడు. అలాగే భారత జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లితో కలిసి 156 బంతుల్లోనే 195 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో మాత్రం రుతురాజ్ గైక్వాడ్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com