కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- January 10, 2026
విజయవాడ: తెలుగు వారి సంస్కృతికి, రుచులకు మరియు కళలకు ప్రతిబింబంగా నిలిచిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ముగింపు వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు.
కళలకు పునర్వైభవం–నంది అవార్డుల పునరుద్ధరణ
గత ప్రభుత్వ హయాంలో కళలు, సంస్కృతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ కందుకూరి, ఉగాది పురస్కారాలను అందజేశామని గుర్తుచేశారు.త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నంది నాటకోత్సవాలు నిర్వహించి, ప్రతిభావంతులకు నంది అవార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంస్థ నాటకం, సినిమా, సాహిత్యం మరియు విభిన్న ప్రదర్శనలను ఒకే వేదికపైకి తీసుకురావడాన్ని మంత్రి దుర్గేష్ అభినందించారు.విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత ప్రస్థానంపై జరిగిన చర్చా కార్యక్రమం, సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్న 'సాహిత్యం-సినిమా' చర్చలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయన్నారు.నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రదర్శించిన కురుక్షేత్ర పద్యాల ఆలాపన, ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెంట్రిలాక్విజం ప్రదర్శనలు యువతను, పిల్లలను అలరించాయన్నారు.
మనలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను, కళలను ప్రపంచానికి తెలపాలన్నఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకొని అధికారికంగా పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కోనసీమలోని జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయమని ఈ సందర్భంగా ఉదహరించారు. రాష్ట్రంలో లబ్ద ప్రతిష్టులైన స్వాతంత్ర్య సమరయోధులు, కవులు తదితరుల జయంతులు, వర్థంతులు జరుపుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నామని గుర్తుచేశారు.
మూడు రోజుల్లో భవానీ ఐలాండ్‌కు 15 వేల మంది, పున్నమి ఘాట్‌కు 30 వేల మంది.. మొత్తంగా 45 వేల మందికి పైగా సందర్శకులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
అమరావతిని ప్రజారాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల ప్రత్యేక రుచిగా అభివర్ణిస్తూ.. జీవితంలోని నవరసాల కలయికే ఈ ఫెస్టివల్ అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులకు, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులకు మరియు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు సంప్రదాయాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రజలకు మరియు అధికారులకు టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ధన్యవాదాలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు శ్యామ్స్, సంజయ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







