PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..

- January 12, 2026 , by Maagulf
PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..

భారత్‌ 2026 అంతరిక్ష క్యాలెండర్‌ను పీఎస్ఎల్వీ-సీ62 మిషన్‌ ప్రయోగంతో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి PSLV-C62 రాకెట్ సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ఉన్నట్టుండి అంతరాయం కలిగిందని ఇస్రో ఛైర్మన్‌ వీ నారాయణన్ ప్రకటించారు. మూడో దశ వరకు రాకెట్‌ ప్రయోగం సాఫీగా జరిగి, ఆ తర్వాత అంతరాయం ఏర్పడిందని తెలిపారు.

ఒక భూమి పరిశీలన ఉపగ్రహంతో పాటు ఇతర 14 ఉపగ్రహాలను PSLV-C62 రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ మిషన్‌ కౌంట్‌డౌన్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన విషయం తెలిసిందే. 260 టన్నుల (2,60,000 కిలోల) బరువు ఉండే పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌.. 400 కిలోల ఈఓఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహానికి “అన్వేష” అని పేరును కూడా పెట్టారు.

భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులోని ధ్రువ సన్-సింక్రోనస్‌ కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టాలి. దీనితో పాటు, ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌ ద్వారా ఏర్పాటైన దేశీయ, అంతర్జాతీయ 14 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలో మోహరించాలి.

స్పెయిన్‌కు చెందిన స్టార్టప్‌కు సంబంధించిన రీ-ఎంట్రీ క్యాప్సూల్‌ను కక్ష్యలో ప్రదర్శనాత్మకంగా పరీక్షించడం ఈ మిషన్‌లో మరో ముఖ్యాంశం. ఇస్రో స్పై శాటిలైట్‌ ప్రయోగం ఇది. దేశ ప్రైవేట్ అంతరిక్ష వ్యవస్థకు ఇది ఊతమివ్వనుంది. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 15 ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరుతున్నాయి. ఇందులోని ప్రధాన ఉపగ్రహమే ఈఓఎస్-ఎన్1.

ఈ 15 ఉపగ్రహాల్లో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అత్యంత రహస్య గూఢచారి ఉపగ్రహమే “అన్వేష”. ఇది అత్యాధునిక చిత్రీకరణ సామర్థ్యాలతో శత్రు స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. హైదరాబాద్‌లోని ధ్రువ స్పేస్ ప్రైవేట్ సంస్థే ఈ మిషన్‌కు 7 ఉపగ్రహాలు అందించింది.

వీటి ద్వారా భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఎలా అభివృద్ధి చెందుతుంతో తెలుస్తోందని ఇస్రో అంటోంది. పీఎస్ఎల్వీ-సీ62 మిషన్ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తున్న తొమ్మిదవ ప్రత్యేక వాణిజ్య మిషన్. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 64వది.

గత ఏడాది మేలో జరిగిన చివరి పీఎస్ఎల్వీ మిషన్ రాకెట్ 3వ దశలో తలెత్తిన లోపం కారణంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత అత్యంత విశ్వసనీయ ప్రయోగ వాహనంగా పేరొందిన పీఎస్ఎల్వీ (PSLV – పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)కి పేరు ఉంది. ఆ నమ్మకాన్ని తిరిగి నెలకొల్పడం కూడా పీఎస్ఎల్వీ-సీ62/ఈఓఎస్-ఎన్1 మిషన్ లక్ష్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com