మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్‌..

- January 21, 2026 , by Maagulf
మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్‌..

ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంట భారత, పాకిస్థాన్ సైన్యాల మధ్య కాల్పులు జరిగాయి. గత రాత్రి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి.

సరిహద్దు భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నియంత్రణ రేఖ వెంట బ్లైండ్‌ స్పాట్‌లను తొలగించేందుకు కేరన్ బాలా ప్రాంతంలో 6 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు అధునాతన నిఘా కెమెరాలను అమర్చుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

నిఘా కెమెరాల ఏర్పాటును అడ్డుకునేందుకు పాకిస్థాన్ దళాలు 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. దీనికి ప్రతిగా భారత సైన్యం ఒక రౌండ్‌ కాల్పులు చేపట్టింది.

ప్రాణనష్టం ఏమన్నా జరిగిందా? అన్న సమాచారం అందలేదు. ఈ కాల్పులు పాక్‌ నుంచి చొరబాటు ప్రయత్నానికి దారి మళ్లించే యత్నమై ఉండవచ్చన్న అనుమానంతో భారత సైన్యం దట్టమైన అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

చలికాలంలో చొరబాటుకు వీలున్న మార్గాల్లో నిఘా కోసం సాంకేతిక పర్యవేక్షణ సాధనాలను నవీకరిస్తూ సెక్టార్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌ సైన్యం ఇటీవల మళ్లీ సరిహద్దు ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు పాక్‌ ఇటువంటి ఘటనలకు పాల్పడుతుండడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com